కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేత.. హైకోర్టు సీరియస్

by  |
high court copy
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్‌లో చెట్లను తొలగించొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హరితహారం పేరుతో మొక్కలు నాటుతూ అభివృద్ధి పేరుతో భారీ చెట్లను నరికివేయడం సబబుకాదన్నారు. ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టు)కింద పార్క్‎లో ఎన్ని చెట్లు తొలగించాలని అనుకుంటున్నారని ఆరా తీసింది. రోడ్డు విస్తరణ పేరుతో ఎకోసెన్సిటివ్ జోన్‎లో చెట్లను తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.

కేబీఆర్ పార్క్‎లో ఎస్ఆర్డీపీ కింద రోడ్డు విస్తరణకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 27న జారీ చేసిన నోటిఫికేషన్‎ను రద్దు చేయాలని కోరుతూ నగరానికి చెందిన ముగ్గురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది.

పార్క్‎లో ఎన్ని వృక్షాలు తొలగిస్తారు, వాటి వయసు ఎంత, వాటి రకాలను తెలియజేస్తూ పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే తొలగించిన భారీ వృక్షాలను రీలొకేట్ చేశారాని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలుపగా ఎన్ని చిగురించాయో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story

Most Viewed