యూకే నుంచి 358 మంది.. అప్రమత్తంగా ఉండండి : హెల్త్ డైరెక్టర్

by  |
యూకే నుంచి 358 మంది.. అప్రమత్తంగా ఉండండి : హెల్త్ డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: యూకే వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ మెల్ల మెల్లగా ప్రపంచానికి పాకుతోంది. ఇప్పటికే ఇండియాలో అడుగుపెట్టిన ఈ వైరస్ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీనిపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూకేలో డిటెక్టైన కరోనా వైరస్ స్ట్రెయిన్‌పై కేంద్రం సూచనలు వచ్చాయని తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూకే నుంచి సోమవారం ఏడుగురు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చారని, ఈ నెల 15 నుంచి 21 తేదీల మధ్య మొత్తం 358 మంది ప్రయాణికులు యూకే నుంచి హైదరాబాద్ వచ్చారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అందరూ బాధ్యతగా గతవారం రోజుల నుంచి తెలంగాణకు వచ్చిన వారు 040-24651119 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇవ్వని యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని అన్నారు.

ఈ కొత్తరకం కరోనా వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కానీ మరణాలు చాలా తక్కువగా సంఖ్యలో ఉంటున్నాయని తెలిపారు. ఇప్పటికే వైద్య శాఖను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. యూకే నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేశామని అన్నారు. గతవారం రోజులుగా యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా ఈ కొత్త వేరియంట్ వైరస్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం విందు, వినోదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని వెల్లడించారు. నాలుగైదు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.



Next Story

Most Viewed