‘కొవిడ్ ఫండ్’పై గంపెడాశలు..!

by  |
‘కొవిడ్ ఫండ్’పై గంపెడాశలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్రం నుంచి వీలైన మేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలనుకుంటోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో ఏ మేరకు ఉపశమనం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదు. దీంతో వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రాలకు ‘కొవిడ్ ఫండ్’ పేరుతో కొంత మేర సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించాలనుకుంటోంది. ఈ నెల 15వ తేదీకల్లా రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపడానికి తుదిగడువు కావడంతో నాలుగైదు రోజుల్లో ఆ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసే అవకాశం ఉంది.

ఆర్థికంగా ఆదుకునేందుకు..

రాష్ట్ర్రంలో పాలమూరు-రంగారెడ్డి లాంటి పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి నిధులు అవసరం. కరోనా కారణంగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి ‘హెలికాప్టర్ మనీ’ రూపంలో కొంత సమకూర్చాల్సిందిగా గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రతిపాదన చేశారు. కానీ ఆ తరహాలో కరోనా అవసరాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి నిధులూ రాలేదు. స్వీయ ఆర్థిక వనరులు కూడా అవసరాలకు తగినంతగా సమకూరలేదు. కేంద్రం నుంచి ఎంతో కొంత వస్తుందని ఆశించినా అవి అడియాశలుగానే మిగిలిపోయాయి. దీంతో రానున్న వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘కొవిడ్ ఫండ్’ పేరుతో కొంత మేర సర్దుబాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరాలనుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ ప్రతిపాదనల గురించి చర్చించిన తర్వాత ఏ మేరకు కేంద్రం నుంచి ఈ రూపంలో నిధులను కోరవచ్చనే దానిపై స్పష్టత రానుంది. పలు రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వివిధ సంస్కరణలను అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితుల ద్వారా జీఎస్‌డీపీలో రెండు శాతం మేర అదనపు రుణాలను సమకూర్చుకోడానికి వీలు కలిగింది. ఇప్పుడు ‘కొవిడ్ ఫండ్’ పేరుతో మరికొంత సమకూర్చుకోడానికి కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.

సర్‌చార్జి విధింపుపై కేంద్రం ఆలోచనలు..

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక వనరులను కోల్పోయిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ప్యాకేజీలను రాష్ట్రాలకు, వివిధ సెక్షన్ల ప్రజలకు కల్పించింది. అయితే ఆ మేరకు ఇప్పుడు నిధులను సర్దుబాటు చేసుకోడానికి ఇటు సామాన్యులపైనా, అటు వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలపైనా సర్‌చార్జి పేరుతో కొత్త వడ్డనలను విధించడంలో ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో కొత్త బడ్జెట్ ఏ విధంగా ఉండాలన్న దానిపై వారి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయాలను సేకరించారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సర్‌చార్జి లాంటివి విధించే ఆలోచనలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రాలకు రాయితీలు, ప్రజలకు వరాలు ఏ మేరకు ఇస్తుందోగానీ సామాన్యులపై కరోనా పేరుతో సర్‌చార్జి లాంటివి మాత్రం తప్పేలా లేదు. ఇప్పటికే చమురు సంస్థలపై ఎక్సయిజ్ సుంకాన్ని పెంచడం ద్వారా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజలపైనే భారం పడింది. ఇకపైన కేంద్రం పన్నులు, సర్‌చార్జిల రూపంలో సమకూర్చుకోవాలనుకుంటున్నది కూడా చివరకు ప్రజలపైనే పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీల అమలు సంగతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినా వాటికి నిధుల కేటాయింపు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలుకు రాష్ట్రాల వాటాతో ముడిపెట్టే కేటాయింపులు.. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. ఫిబ్రవరి 1వ తేదీతో కేంద్రం ఏం ఇస్తుందన్నదానిపై స్పష్టత వస్తుంది.


Next Story

Most Viewed