అప్పులతోనే అభివృద్ధి.. మరో గతి లేదు..!

by  |
అప్పులతోనే అభివృద్ధి.. మరో గతి లేదు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ నివేదికపై నిరసన వ్యక్తం చేస్తూ ఎక్కువ ఫిట్‌మెంట్ కోసం డిమాండ్ చేస్తూ ఉంటే మరోవైపు ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగలేదని, ఈసారికి సర్దుకోవాలని కోరుతున్నారు. దాదాపు ఆరేళ్లుగా రాష్ట్రంలో రెవెన్యూ ఖర్చు బాగా పెరిగిపోతోందని, ఉద్యోగుల జీతాలకు, వివిధ సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకే సింహభాగం పోతోందని అంటున్నారు. అభివృద్ధి పనులకు నిధుల కటకట ఏర్పడిందని పీఆర్సీ తన నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసినవారికి పింఛన్లు, సంక్షేమ పథకాలకు కలిపి రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో సుమారు 90% మేర ఖర్చవుతోందని వివరించింది. రాష్ట్ర సంపదను సృష్టించే మౌలిక సౌకర్యాలు, ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నిధులే ఉండడంలేదని అభిప్రాయపడింది.

సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అనివార్యంగా అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అప్పులతో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు కష్టంగా మారిందని, చేతిలో ప్రస్తుతం రూ. 2.03 లక్షల కోట్ల అప్పు ఉందని పీఆర్సీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన రూ. 40 వేల కోట్లకు పైగా కొత్త అప్పులను కలుపుకుంటే నికరంగా చెల్లించాల్సిన అప్పులు దాదాపు రెండున్నర లక్షల కోట్లకు చేరుకున్నట్లయింది. ఇప్పటికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటికి కొనసాగింపుగా ఉన్న సబ్సిడీలను చూసే పీఆర్సీ ఆందోళన వ్యక్తం చేస్తే ఇంకా అమలులోకి రావాల్సిన రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కొత్తగా ఉద్యోగాల భర్తీ లాంటి వాటి ద్వారా ఇంకెంత భారం పడుతుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడానికి రకరకాల హామీలను, వినూత్న పథకాలను ప్రకటించే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటిని విధిగా అమలుచేయక తప్పదు. వాటి అమలుకోసం వేల కోట్ల రూపాయలను కేటాయించడం కత్తిమీద సాములా తయారైంది. అందులో భాగమే ఇప్పుడు ఉద్యోగులు 65% వరకూ ఫిట్‌మెంట్‌ను ఆశిస్తే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న పీఆర్సీ కేవలం ఏడున్నర శాతంతో సరిపెట్టాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాలకు, సబ్సిడీలకు చేస్తున్న ఖర్చుల వివరాలను పరిశీలిద్దాం.

ఖర్చు ఇలా

రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ ఖర్చు రూ. 1.11 లక్షల కోట్లు (2019-20 బడ్జెట్‌) ఉంటే అందులో దాదాపు సగం రూ. 58,198 కోట్లు సబ్సిడీలకు, సంక్షేమ పథకాలకే ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తం రెవెన్యూ ఖర్చులో వీటి వాటా దాదాపు 52.4%గా ఉంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 31.08%గా ఉంటే, 2018-19 నాటికి 35.42%గా స్థిరంగానే కొనసాగింది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసరా పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి సాయం పెంపు, రైతుబంధు సాయం పెంపు లాంటి హామీల అమలులో భాగంగా ఏకంగా 52.40% మేర ఈ పథకాల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది.

జీతాలు, పింఛన్లకూ తక్కువేమీ లేదు

ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ఏర్పడిన కొత్తలో 42% ఫిట్‌మెంట్ రూపంలో, మరో ఒక శాతం ‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రూపంలో మూల వేతనంలో పెంపుదలను అందుకున్నారు. ఐదేళ్ళ తర్వాత కొత్త పీఆర్సీలో మళ్ళీ అంతకంటే ఎక్కువగానే ఆశించి కనీసంగా 63% ఫిట్‌మెంట్‌ను కోరుకున్నారు. రెండున్నరేళ్ళ పాటు వివిధ రాష్ట్రాల్లోని ఉద్యోగులు అందుకుంటున్న వేతనాలు, తెలంగాణ జీఎస్‌డీపీ, ఆర్థిక వృద్ధి రేటు, స్వీయ ఆదాయ వనరుల పరిస్థితి తదితరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేవలం ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌ను మాత్రమే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గంపెడాశలు పెట్టుకున్న ఉద్యోగులకు ఈ సిఫారసు మింగుడు పడలేదు. అందుకే నివేదికను తగులబెట్టడం మొదలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తలో పరవాలేకుండే

తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏటా రూ. 16,378 కోట్లను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ చేసినవారికి పింఛన్ల రూపంలో చెల్లించేవారు. 2017-18 నాటికి అది ఏకంగా రెండున్నర రెట్లు పెరిగి రూ. 35,282 కోట్లకు చేరుకుందని నివేదిక వివరించింది. గతేడాది చివరి నాటికి ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి వస్తున్న స్వీయ ఆదాయ వనరుల్లో సుమారు 40% కేవలం జీతాలు, పింఛన్ల కోసమే ఖర్చవుతోందని, మొత్తం ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు మూడవ వంతు కేటాయించాల్సి వస్తోందని పేర్కొంది.

సబ్సిడీలు, సంక్షేమం, ఉద్యోగుల వేతనాలకు భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి రావడంతో ఆదాయంలో 90% వీటికే సరిపోతున్నాయని, ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర నిర్మాణ అవసరాలకు ఖర్చు పెట్టడానికి (ద్రవ్య పెట్టుబడి) అనివార్యంగా అప్పులు తప్ప మరో మార్గం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పులు కూడా మోయలేనంత భారంగా మారాయని, రానున్న మరో ఐదేళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుందని అంచనా వేసి ఆర్థిక నిర్వహణ విషయంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని, సమర్ధవంతమైన విధాన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది.

సబ్సిడీలు ఇలా

విద్యుత్ సబ్సిడీ : 2014-15లో రూ. 2,400 కోట్లు ఉంటే గతేడాదికి అది రూ. 8,000 కోట్లకు పెరిగింది.

బియ్యం సబ్సిడీ : 2014-15లో రూ. 690 కోట్లుగా ఉంటే గతేడాదికి రూ. 2,287 కోట్లకు చేరుకుంది.

స్కాలర్‌షిప్‌లు : రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 1,372 కోట్లు ఉంటే గతేడాది చివరకు అది రూ. 3,257 కోట్లకు పెరిగింది.

కల్యాణలక్ష్మి : ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి నాళ్ళలో కేవలం రూ. 67 కోట్లు ఉంటే గతేడాదికి అది రూ. 1,540 కోట్లకు చేరుకుంది.

రైతుల రుణమాఫీ : 2014-15లో రూ. 4,159 కోట్లు ఉంటే గతేడాదికి అది రూ. 6000 కోట్లయింది.

రైతుబీమా : 2018-19లో రూ. 500 కోట్లు మాత్రమే ఉంటే గతేడాదికి రూ. 12,000 కోట్లకు పెరిగింది.

రైతుబంధు : ప్రతీ ఏటా రూ. 12,000 కోట్ల మేర సగటున ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఆసరా పింఛన్లు : రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రూ. 1,834 కోట్లు ఉంటే గతేడాది చివరకు అది రూ. 9,402 కోట్లకు పెరిగింది.

అప్పులపై వడ్డీల చెల్లింపు : తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 5,227 కోట్ల మేర పాత అప్పులపై వడ్డీలు చెల్లించాల్సి ఉండగా గతేడాది చివరికి దాదాపు మూడు రెట్లతో రూ. 14,575 కోట్లకు పెరిగింది.

Next Story

Most Viewed