సాలె పురుగులతో మానవులు సంభాషించొచ్చు..?

by Nandhaamani |
సాలె పురుగులతో మానవులు సంభాషించొచ్చు..?
X

దిశ, వెబ్‌డెస్క్: మానవుని మేధస్సుకు సాంకేతిక ప‌రిజ్ఞానం తోడైతే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయనడానికి ఇదో గొప్ప ఉదాహరణ. సాధారణంగా భిన్న భాషల వారి మధ్య సంభాషణ జరగాలంటేనే ఆపసోపాలు పడుతున్న ఈ తరుణంలో సాలె పురుగుతో ఎలా మాట్లాడగలం..? అసలు ఇది సాధ్యమేనా అనుకుంటున్నారా..? అవును ప్రతిఒక్కరికీ ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజం. కాని మన సందేహాలను పటాపంచెలు చేస్తూ సాంకేతిక ప‌రిజ్ఞానంతో మానవుడు స్వేచ్ఛగా సాలె పురుగుతో మాట్లాడవచ్చని చెబుతున్నారు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యూఎస్ పరిశోధకులు. అసలు సాంకేతిక ప‌రిజ్ఞానంతో సాలె పురుగులకు మానవులకు మధ్య సంభాషణ ఎలా జరుగుతుంది. ఈ పరిశోధనలో ఎంతవరకు వాస్తవం దాగుంది..తదితర ఆసక్తికర అంశాలను ప్రధాన పరిశోధకులు మార్కస్ బ్యూలర్ ఈ కింది విధంగా వెల్లడించారు.

పరిశోధన సాగుతుందిలా..

వివిధ జాతులు, పక్షులు చేస్తున్న శబ్ధాలను సాంకేతిక ప‌రిజ్ఞానంతో మ్యూజిక్ నోట్స్‌లో రూపొందించి ఇప్పటికే చాలా జంతుజీవాల సంభాషణలు అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే సాలె పురుగులతో కూడా సంభాషణలు కొనసాగించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా సాలె పురుగులు సాలె గూడులు కట్టుకొని నివసించడంతో దృశ్య సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కదలికల ఆధారంగానే తమ మనుగడను కొనసాగిస్తాయి. ఈ తరుణంలోనే మొదటిగా సాలె పురుగు తన కదలికలతో గూడును ఏ విధంగా అల్లుతుందో గమనించారు. వాటి కదలికల ద్వారా వచ్చే కంపనాలను 2డీ ద్వారా పొందుపరిచారు. కంప్యూటర్ అల్గరిదమ్ సాయంతో సాలె గుళ్లను త్రీడీలో రూపొందించి వాటి కదలికల శబ్ధాలను నోట్ చేశారు. ఇలా అవి చేసిన శబ్ధాలను మ్యూజిక్ పరిభాషలోకి అనువదించి వాటి సంభాషణలు అర్థం చేసుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు.

అసాధ్యం సుసాధ్యమవుతుందా..?

పరిశోధనకు సంబంధించి ఇప్పటికే చాలా ముందడుగు వేశామని పరిశోధకుల బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. తొలుత ఆశ్చర్యం అనిపించినా ఈ పరిశోధన సఫలీకృతం అయితే మానవులు సాలె పురుగులతో సంభాషించే సరికొత్త అనుభూతికి లోనవుతారని వివరిస్తున్నారు. ప్రస్తుతానికి సాలె పురుగుల కదలికల శబ్ధాలను ప్రభావమంతంగా మ్యూజిక్ పరిభాషలోకి ఎలా అనువదించాలనే అంశంపై పరిశోధన చేస్తున్నామన్నారు. ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తే పరిశోధన ఆఖరి ఘట్టానికి చేరుతుందని, అసాధ్యం సుసాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ కెమికల్ సొసైటీలో తమ ప్రతిభను చాటుకోవడానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story