ఇప్పుడు టీమ్ ఇండియాలో ఈ అంశం కలవర పెడుతున్నది

by  |
Match-21
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 రౌండ్ మొదలు కావడానికి మరో 16 రోజులే మిగిలి ఉన్నాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో ఆడనున్నది. లీగ్ దశలో భారత జట్టు 5 మ్యాచ్‌లు ఆడాలి. ఇందులో కనీసం 4 మ్యాచ్‌లు గెలిస్తే కానీ సెమీఫైనల్స్ వెళ్లే అవకాశం ఉండదు. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికైన క్రికెటర్ల ఫామ్ చూస్తే భారత జట్టు సునాయాసంగానే సెమీస్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత జట్టు 5 లీగ్ మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడుతుంది. ఐపీఎల్‌లో వాడిన పిచ్‌లు టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఉపయోగించనున్నారు. ఐపీఎల్ సమయంలో దుబాయ్ పిచ్‌ గమనిస్తే ఇది ఎక్కువగా బౌలర్లకు సహకరించింది. ఈ వికెట్‌పై లో స్కోరింగ్ గేమ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. కానీ, తక్కువ స్కోరును కూడా బౌలర్లు డిఫెండ్ చేస్తున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా బౌలర్లు ఎంత కీలకంగా వ్యవహరించాలో అర్ధమవుతున్నది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. పేసర్లతో పాటు స్పిన్నర్లు బంతితో మంచి ప్రదర్శన చేస్తున్నారు. దీంతో తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

అశ్విన్‌కు స్థానం దక్కేనా?
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ బౌలర్ల కోటాలో మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. వీరిలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న అక్షర్ పటేల్ యూఏఈ పిచ్‌లపై రాణిస్తున్నాడు. మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మంచి ఎకానమీతో బంతులు వేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను అంచనా వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక రాహుల్ చాహర్ ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. కానీ, కీలకమైన సమయంలో అతడు వికెట్లు తీసిన అనుభవం ఉన్నది. భారత జట్టు ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. తుది జట్టులో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఉంటే రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమే అవుతుంది. అక్షర్, వరుణ్ కాంబినేషన్ లెఫ్ట్ అండ్ రైట్‌లో ఉండటం కూడా వారిద్దరికి అవకాశం దక్కేలా చేయవచ్చు. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్‌లో వికెట్లు తీశాడు కానీ, పెద్దగా ప్రభావం చూపలేదు. అందులోనూ టీమ్ ఇండియా టీ20 జట్టులోకి నాలుగేళ్ల తర్వాత వచ్చాడు. దీంతో అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది అనుమానమే. మూడో స్పిన్నర్ కావాలని అనుకుంటే.. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశం ఉన్నది. ఐపీఎల్‌లో బ్యాటుతో కూడా రాణించడంతో అశ్విన్ కంటే జడేజాకు ప్రాధాన్యత దక్కవచ్చు.

కలవర పెడుతున్న పేసర్లు..
టీమ్ ఇండియా స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నా పేసర్ల విషయమే టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవర పెడుతున్నది. గతంతో పోలిస్తే జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా యూఏఈ పిచ్‌లపై అతడు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్ కుమార్ అయితే పూర్తిగా విఫలమయ్యాడు. ఒకప్పుడు డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న భువీ.. గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి ఫామ్‌ను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహ్మద్ షమీ ఒక్కడే కాస్త ఫామ్‌లో ఉన్నాడు. పవర్ ప్లే‌లో వికెట్లు తీయడంతో షమి సఫలం అవుతున్నాడు. కీలకమైన సమయంలో కూడా వికెట్లు తీస్తున్నాడు. అయితే పేసర్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో పాండ్యా ఘోరంగా విఫలం అయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ కూడా చేయలేకపోతున్నాడు. దీంతో అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనేది అనుమానమే. ఏదేమైనా టీ20 స్క్వాడ్ తుది జట్టులో స్పిన్నర్లు మాత్రం బాగా పోటీ ఉన్నది. అందరూ ఫామ్‌లో ఉండటంతో ఎవరిని తీసుకోవాలనే దానిపై మేనేజ్‌మెంట్ కసరత్తు చేయాల్సి ఉంది.


Next Story

Most Viewed