'సీఎం హామీలు కేవలం ఉద్యోగ సంఘాల నేతలు, వారి బంధువులకేనా..?'

by  |
సీఎం హామీలు కేవలం ఉద్యోగ సంఘాల నేతలు, వారి బంధువులకేనా..?
X

దిశ, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై భారతీయ ఉపాధ్యాయ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. హామీల విషయంలో వారు తీవ్రంగా మండిపడుతూ కేసీఆర్ ను ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. భారతీయ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కన్వీనర్ పబ్బతి శ్రీనాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీలు కేవలం ఉద్యోగ సంఘాల నేతలు, వారి బంధువులకు మాత్రమేనా అని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని కేవలం టీజీవో, టీఎన్జీవో నేతల భర్తలకు, బావమరదులకు, బంధువులకు మాత్రమే అమలు చేయడం ప్రభుత్వం యొక్క అసంబద్ధమైన వైఖరిని తెలియజేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై పక్షపాత ధోరణి సరికాదని, వెంటనే వయోపరిమితి పెంపు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వంగ నర్సిరెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోతలు విధిస్తూ మరో వైపు వ్యక్తిగత లబ్ధి కోసం ప్రత్యేక జీవోలను విడుదల చేయడం ఆక్షేపణీయమన్నారు. జూన్ మాసంలో పూర్తి వేతనాలు చెల్లించాలని, మూడు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలుగా చెప్పుకునే నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలను వీడి వ్యవస్థ ప్రయోజనాలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. ఈ సమావేశంలో భారతీయ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు రిక్కల రవీందర్ రెడ్డి , గడిల శ్రీకాంత్, పెండెం శ్రీకాంత్ సురేష్ , అనుముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story