జీవో 317 పై వినూత్నంగా నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

58
Teachers

దిశ ప్రతినిధి, మెదక్: మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగి పండుగ ఉమ్మడి మెదక్ జిల్లాలో కన్నుల పండువగా సాగింది. వేకువజామునే యువతలు, మహిళలు ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, నవధాన్యాలతో అలంకరించారు. సాయంత్రం వేళ పిల్లలకు భోగిపండ్ల ఆశీర్వచనం అందించారు. భోగి పండుగ సందర్భంగా పలు ఇండ్లలో చేసిన పిండి వంటలు ఘుమ ఘుమలాడే. చిన్నారులకు పలువురు పతంగులు అందించారు. పల్లెల్లో క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు కొనసాగాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కోడి పందెం పోటీలు నిర్వహించి పోలీసులకు పట్టుబడ్డారు.

జీవో 317 పై ముగ్గులు వేసి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..

Teachers

ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో నెం .317 ను నిరసిస్తూ ఇంటి ముందు కేసీఆర్ మాట ముద్దు.. దంపతులను వీడదీయొద్దంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు శాపంగా మారిన జీవో నెం .317 పై గత కొంత కాలంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం నిరసిస్తున్నాయి. పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్, డీఈవోలకు వినతిపత్రాలు అందించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ భార్యభర్తలను ఒకేచోట చేర్చడంలోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీనికి నిరసనగా పలువురు ఉపాధ్యాయులు ఇంటి ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కేసీఆర్ మాట ముద్దు.. దంపతులను విడదీయొద్దు.. 316 జీవో ( స్పౌజ్ ) బాధితులు సిద్దిపేట జిల్లా అంటూ పలువురు ఉపాధ్యాయులు తమ ఇంటి ముందు ముగ్గు వేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జిల్లాలో పలుచోట్ల పందెం పోటీలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అదే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కోడి పందాలు నిర్వహించడంలో కోడి పందెలా విషయం బహిర్గతమైంది. సంగారెడ్డి జిల్లాలో కోడి పందెం పోటీలు నిర్వహిస్తున్న 14 మందిని, 13 కోళ్లను, 14 సెల్ ఫోన్లను , రూ .94,600 స్వాధీనం చేసుకున్నారు. వీరే కాకుండా జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా కోడి పందెం పోటీలు జోరుగా కొనసాగాయి. లక్షలు వెచ్చించి బెట్టింగ్ కాసినట్టు సమాచారం. భోగి నాడు ఒక్క రోజే లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.

నేడే సంక్రాంతి..

సంక్రాంతి అనగా సంక్రమణం అని అర్థం. 27 నక్షత్రాలు, నక్షత్రానికి నాలుగు పాదాలు, మొత్తం 108 పాదాలు, ఆ పాదాలను 12 రాశులు గా విభజిస్తే సూర్యుడు నెలకో రాశి లోకి వెళ్ళాడు. ఈ నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగలి, పిండి వంటలతో పితృదేవతల, దేవుళ్ల పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో మాంసం తెచ్చుకుంటారు. నేడు శనివారం సందర్భంగా చాలా మంది ఆదివారం తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.