విద్యార్థులు చదువుకోవద్దా.. టీచర్ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు..?

by  |
Teachers
X

దిశ, అశ్వారావుపేట : సరిపడా ఉపాధ్యాయులు అందుబాటులో లేక విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. దీంతో విద్యా్ర్థులు వెనుకబడి పోతున్నారు. జిల్లా అధికారులు మాత్రం ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నట్టు చెబుతున్నా.. టీచర్లకు మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. దీనంతటికి కారణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 211 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటమే. గతేడాది మార్చి నెలలో ప్రభుత్వం విద్యా వాలంటీర్లు వ్యవస్థను ఎత్తివేయడం, ఆపై నేటికీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వలన ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వలన విద్యార్థులకు సరైన విద్యా బోధన అందక చదువులో విద్యార్థులు వెనుకబడి పోయారు. అయినా కూడా ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడం లేదు. టీచర్లు కూడా తాము బ్రేక్ లేకుండా లేకుండా బోధన చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో అయితే, ఒకే ఉపాధ్యాయుడితో తరగతులు నడుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

అటెండర్లు లేక అవస్థలు..

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రైవేట్ అటెండర్లను కూడా తీసివేసి, ఆ బాధ్యతలను గ్రామపంచాయతీలకు అప్పజెప్పడం వలన పాఠశాలలో పరిశుభ్రత కరువైంది. పాఠశాల్లో ఉన్నటువంటి తరగతి గదులు, స్టాఫ్ రూములను కొన్ని సార్లు ఉపాధ్యాయులు, విద్యార్థులే శుభ్రం చేసుకుంటున్నారు. పంచాయతీ వారు రెండు, మూడు రోజులకు ఒకసారి పాఠశాలల వైపు చూస్తున్నారని, తరగతి గదులు, స్టాఫ్ రూంలు తమే శుభ్రం చేసుకుంటున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మరుగుదొడ్లు కూడా తామే శుభ్రం చేసుకుంటున్నామని వాపోతున్నారు.

పూర్తికానీ పాఠ్యపుస్తకాల పంపిణీ..

నియోజకవర్గ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి పాఠశాలల పున:ప్రారంభం అయినప్పటికీ విద్యార్థులకు మాత్రం 70% వరకే పాఠ్య పుస్తకాలు పంపిణీ జరిగింది. కొన్ని పాఠశాలల్లో గతేడాది చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు స్వీకరించి ప్రస్తుత తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సరైన రీతిలో విద్యనందించేందుకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి, నూతన పాఠ్య పుస్తకాలు అందజేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలలో అటెండర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Next Story