అచ్చంపేటలో టీచర్ ఫ్యామిలీకి రూ. 50 లక్షలు

by  |
Shanmuk-1
X

దిశ, అచ్చంపేట: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలు, కుటుంబ రక్షణ కోసం జీవిత బీమాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మన్ననూర్ ఐటీడిఏ పీఓ అశోక్, ఆర్డీఓ పాండు నాయక్, సీఐ అనుదీప్ లు అన్నారు. అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో జీహెచ్ఎంగా పనిచేస్తున్న బాలరాజు గత మే నెలలో కరోనా బారినపడి మృతి చెందారు. ఆయన అడ్వైజర్ చందునాయక్ ఆధ్వర్యంలో ఎక్సైడ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లో టర్మ్ పాలసీ తీసుకున్నారు. ఏడాదికి రూ. 67 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లించాడు. ఆయన కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ. 50 లక్షల బీమా చెక్కును బుధవారం అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం నందు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ గుండె చెదిరిన గూడు పదిలంగా ఉండాలంటే, ధైర్యం కోసం ప్రతి ఒక్కరూ జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా బీమా తీసుకోవచ్చన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. ఉపాధ్యాయుడు బాలరాజు కరోనా వల్ల మృతి చెందడం బాధాకరమని.. ముందు చూపుతో బీమా చేసుకోవడం వల్ల ఆయన కుటుంబానికి ఆర్థిక లోటు రాకుండా ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా కంపెనీ అండగా నిలిచిందని కొనియాడారు. కుటుంబానికి బీమా డబ్బులు అందడం పట్ల కంపెనీ అడ్వైజర్, కంపెనీ పనితీరును అభినందించారు. కుటుంబం, భార్య, పిల్లల కోసం తన సంపాదనలో కొంత మేరకు జీవిత బీమాకు కేటాయించాలన్నారు. చాలా మందికి బీమా సంస్థల పట్ల అవగాహన లేకపోవడం వల్ల పాలసీలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.

సంసారం, సంపాదన ఉన్న ప్రతి ఒక్కరూ బీమా తీసుకోవాలని, బీమా చేసిన వ్యక్తి ధైర్యంగా ఉంటారని అన్నారు. బాలరాజు కుటుంబానికి ఎక్సెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మంజూరైన రూ. 50 లక్షలు ఇవ్వడం అనేది ఈ ప్రాంతంలోనే అతి పెద్ద క్లైమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ అనంతయ్య, ఏడీఏ విజయనిర్మల, సీడీపీవో దమయంతి, సూపర్ వైజర్లు కమల, బిపాష, ఎక్సైడ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రమ్య అన్నే, ఏజెన్సీ లీడర్లు పారేపల్లి మురళి కృష్ణ, స్వప్న కమలాకర్, ఎడమ శ్రీనుయాదవ్, యండీఆర్టీ మెంబర్లు చందునాయక్, శ్రీధర్, రామకృష్ణ, కర్నాటి శ్రీనివాసులు, అడ్వైజర్లు ఉడుత శ్రీనివాసులు, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

Next Story