'క్యూర్‌ఫిట్'ను కొనుగోలు చేసే యోచనలో టాటా గ్రూప్!

by  |
క్యూర్‌ఫిట్ను కొనుగోలు చేసే యోచనలో టాటా గ్రూప్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ డిజిటల్ విభాగంలో మరింత దూకుడును కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ-కిరాణా రంగంలో మెరుగైన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాటా గ్రూప్ దేశీయ డిజిటల్ రంగంలో ‘సూపర్ యాప్’ కోసం మరింత వేగవంతమైన ప్రణాళికను అనుసరిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఫిట్‌నెస్ రంగంలో ఉన్న క్యూర్‌ఫిట్ యాప్‌ను కొనేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకే పలు ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తున్న స్టార్టప్‌లను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ రాబోయే తన సూపర్ యాప్ కోసం మరిన్ని కంపెనీలను గ్రూప్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్, ఎడ్యుకేషన్, ఈ-కిరాణా, ట్రావెల్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్, బ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సహా అనేక రంగాలకు చెందిన సేవలను ఒకే యాప్ ద్వారా సేవలను అందించేందుకు టాటా గ్రూప్ అన్ని అవకాశాలను సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే ఈ-ఫార్మా రంగంలో 1ఎంజీ స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసింది. దీంతోపాటు టాటా గ్రూపునకు చెందిన రిటైల్ కంపెనీలు ఇన్ఫినిటీ, ట్రెంట్‌లను ఒక దగ్గరకు చేర్చాలని సంస్థ భావిస్తోంది. ‘ఒక్కో వ్యాపార విభాగం వేర్వేరుగా కాకుండా అన్నిటినీ ఒకేదగ్గరకు తీసుకురావాలని యోచిస్తున్నాం. టాటా గ్రూపునకు చెందిన సూపర్ యాప్ అన్ని రకాల సేవలు, ఉత్పత్తులను అందించనున్నట్టు’ గతంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.



Next Story

Most Viewed