డెలివరీ సేవల సంస్థ డన్‌జోతో టాటా డిజిటల్ చర్చలు..

by  |
డెలివరీ సేవల సంస్థ డన్‌జోతో టాటా డిజిటల్ చర్చలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా డిజిటల్ ఈ-కామర్స్ విభాగంలో పట్టును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫిట్‌నెస్ విభాగంలో క్యూర్‌ఫిట్, ఈ-కిరాణా బిగ్‌బాస్కెట్ లాంటి స్టార్టప్‌లను కొనుగోలు చేసిన సంస్థ తాజాగా, గూగుల్ తోడ్పాటు ఉన్న హైపర్ లోకల్ డెలివరీ సేవల సంస్థ డన్‌జోను సైతం చేజిక్కించుకునే అవకాశాలున్నట్టు సమాచారం. డన్‌జోలో నియంత్రణ వాటా కోసం టాటా సన్స్ చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 1000-రూ. 1400 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే, దీనికి సంబంధించి ఇరు సంస్థలు స్పందించేందుకు నిరాకరించాయి.

ఈ ఏడాది మొదట్లో సిరీస్-ఈలో భాగంగా ఈ సంస్థ సుమారు రూ. 300 కోట్ల వరకు నిధులను సేకరించింది. అంతేకాకుండా సంస్థ పరిధిని విస్తరించేందుకు రూ. వెయ్యి కోట్ల వరకు సమీకరించాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా రానున్న రెండేళ్లలో రూ. 7 వేల కోట్ల ఆదాయం కలిగిన వ్యాపారాన్ని కంపెనీ లక్ష్యంగా ఉంది. టాటా డిజిటల్ ఇటీవల ఆన్‌లైన్ కిరాణా స్టార్టప్‌ బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత కొద్ది రోజులకే క్యూర్‌ఫిట్‌లో రూ. 550 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, ఆన్‌లైన్ ఫార్మా 1ఎంజీని కూడా కొనే అంశాన్ని టాటా సంస్థ పరిశీలిస్తోంది. త్వరలో రానున్న టాటా సూపర్-యాప్ కోసం ఆన్‌లైన్ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది.

డన్‌జో గురించి..

2015లో కబిర్ బిస్వస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్, ముకుంద్‌లు ప్రారంభించిన డన్‌జో గతేడాది జూన్‌లో రూ. 1,600 కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ స్థూల విలువ జోడింపు (జీవీఏ) రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం రూ. 700 కోట్లకు పైగా వార్షిక వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 2019లో గూగుల్, లైట్‌బాక్స్, ఈక్విటీ సంస్థ 3ఎల్ కేపిటల్, దక్షిణ కొరియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆల్టేరియా కేపిటల్ రూ. 80 కోట్ల నిధులను వెచ్చించింది. గతేడాది మార్చితో ముగిసిన సంవత్సరంలో కంపెనీ ఆదాయం 4 రెట్లు పెరిగి రూ. 77 కోట్లకు చేరుకుంది.



Next Story

Most Viewed