కాఫీడే వ్యాపారంలోకి టాటా సంస్థ!

by  |
కాఫీడే వ్యాపారంలోకి టాటా సంస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: కేఫ్ కాఫీ డే సంస్థ తన కాఫీ వెండింగ్ బిజినెస్‌ను టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కేఫ్ కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత సంక్షోభంలో పడిన కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, కేఫ్ కాఫీ డే ప్రతిపాదనను టాటా బోర్డు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కాఫీ డే వెండింగ్ వ్యాపార విలువ రూ.2,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

భారత్‌లోనే అతిపెద్ద కాఫీ తయారీ సంస్థగా ఉన్న కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాత్తుగా మరణించడంతో సంస్థ అప్పులు చెల్లించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను అనుసరిస్తోంది. దీనికోసం సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సిద్ధమైంది. ఇదివరకు కాఫీ డేకు చెందిన కార్పొరేట్ బిజినెస్స్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థకు విక్రయించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సంస్థ కాఫీ వెండింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేయడంపై ఇరు సంస్థలు స్పందించాల్సి ఉంది.

టాటా టీ, టెట్లీ, టాటా సాల్ట్ వంటి ఉత్పత్తులను కలిగి ఉన్న టాటా కన్జ్యూమర్ దేశీయంగా ఉనికిని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే భారత్‌లో స్టార్‌బక్స్ కార్పొరేషన్‌తో జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తోంది. కాఫీ డే వెండింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేయడం ద్వారా విస్తరణకు మరింత సులభమవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, తదుపరి పరిణామాల అనంతరం ఒప్పందం జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేమని సంబంధిత వ్యక్తులు తెలిపారు. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా కాఫీ డే వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వాములను చేర్చుకోవాలని చూస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

Next Story

Most Viewed