తమిళ రాజకీయాల్లో టీ రాజేందర్.. శింబు పాత్రేంటి?

by  |
తమిళ రాజకీయాల్లో టీ రాజేందర్.. శింబు పాత్రేంటి?
X

దిశ, సినిమా : తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరో సెలబ్రిటీ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ప్రముఖ దర్శకులు, సూపర్ స్టార్ శింబు తండ్రి టీ రాజేందర్(టీఆర్) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. పైసా తీసుకోకుండా ప్రజలు ఓటేసేలా మార్పు తీసుకొస్తానని సవాల్ చేశాడు. ఒంటరిగానే పోటీచేస్తానని, ఓటు ఎంత విలువైందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తానని అన్నాడు. ఎన్నికల్లో ఓడుతానా? గెలుస్తానా? అన్న మ్యాటర్ పక్కనబెడితే, నిరంతరం క్వశ్చన్ చేస్తూనే ఉంటానని.. పార్టీల కోసం కాకుండా మతాలకతీతంగా జనం కోసం మాట్లాడతానని తెలిపాడు.

మనిషి ఎప్పుడూ తన మన:సాక్షికి భయపడాలన్న టీఆర్.. ఓటుకు నోటు సరిగ్గా ఇవ్వట్లేదని ప్రజలు ధర్నా చేస్తుంటే దేశం ఎటువైపు పోతుందా? అని భయమేస్తుందన్నాడు. నిష్పక్షపాతంగా పనిచేసేవాళ్లని ఎన్నుకోవాలని గాంధీజీ కోరుకున్నాడని.. కానీ ఆయన ఫొటో ఉన్న నోటునే ఓటు కోసం వాడుకోవడం శోచనీయం అన్నాడు. తమకు ఓటు వేస్తే ఆరు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్తున్న నాయకులు.. కరోనా టైమ్‌లో ప్రజలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. కరెంట్ బిల్లుల విషయంలో ఎందుకు ఆదుకోలేదని.. తిండి గింజలు లేక అల్లాడుతుంటే వాళ్ల దగ్గరకు ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. అంటే ఈ తిప్పలన్నీ ఓటుకోసమే తప్ప ప్రజాసంక్షేమం కోసం కాదు కదా! అని చురకలంటించాడు టీఆర్.



Next Story

Most Viewed