త్వరలోనే టీ-హబ్ ఫేజ్-2 ప్రారంభం

by  |
త్వరలోనే టీ-హబ్ ఫేజ్-2 ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రూ.276 కోట్లతో హైదరాబాద్ రాయదుర్గంంలోని 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్ -2ను ప్రభుత్వం నిర్మించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్. ఇందులో 2వేలకు పైగా స్టార్టప్ లకు అవకాశం కల్పించారు. దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

దేశంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌ రెండో దశ పనులు పూర్తయ్యాయి. కరోనాతో ఏడాదిన్నర పాటు ఆలస్యమైనప్పటికీ, రెట్టింపు వేగంతో నిర్మాణం పూర్తి చేశారు. దీంతో అతి త్వరలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రపంచం గర్వించదగిన ఆలోచనలు ఆవిష్కరణలుగా రూపుదిద్దుకోవడంలో టీహబ్‌ కృషి చేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం రూ. 276 కోట్లు ఖర్చుతో టీహబ్-2 ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా రికార్డు సృష్టించనుంది. 2017 జనవరిలో శంకుస్థాపన చేసి, 2019లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. అయినప్పటికీ కరోనా, ఇతర కారణాలతో ఆలస్యమైంది. 2000 పైగా స్టార్టప్స్‌కి ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. టెక్నాలజీ ప్రియులతో పాటు, సామాన్యుల ఆలోచనలకు సైతం ఇక్కడ ప్రోత్సాహం అందనున్నది.

ఇక్కడ రూపుదిద్దుకున్న ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌ ఫెసిలిటీ వల్ల స్టార్టప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కల్చర్‌కు కొత్త ఊపు లభించనున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్‌ ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే పారిశ్రామికవేత్తలైన వెంచర్‌ క్యాపిటలిస్టులు- ఏంజిల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించనున్నట్లు పారిశ్రామిక వేత్తలు పేర్కొంటున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలకు అండగా నిలిచి, ఆవిష్కరణలుగా రూపుదిద్దుకోవడంలో తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం టీ-హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 70వేల చదరపు అడుగుల్లో టీ-హబ్‌ను 2015 నవంబర్‌ 15న గచ్చిబౌలిలో అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్స్‌ కేంద్రాన్ని మించేలా ఏర్పాటు చేశారు. మొదలైన ఐదేండ్ల కాలంలో దాదాపు 1200 స్టార్టప్స్‌కి సహకారం అందించి రూ.1800 కోట్లు ఆకర్షించింది. దీని ద్వారా 2,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. టీ-హబ్‌ చొరవ విజయవంతం కావడంతో మరింత ఎక్కువ మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఊతం అందించడం, తద్వారా తెలంగాణ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టాన్ని పెంపొందించేందుకు టీ-హబ్‌ 2 ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది.


Next Story

Most Viewed