బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. బీజీపీ అంతం ఆరంభమన్న మాజీ మంత్రి

29
up

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 30 రోజుల సమయం ఉండగా అధికార బీజేపీ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అఖిలేష్ యాదవ్ పార్టీలో చేరిన వారిలో మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు రోషన్‌లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, ముఖేష్ వర్మ, వినయ్ షాక్యా భగవతి సాగర్‌తో సహా అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్‌కు పార్టీకి చెందిన చౌదరి అమర్ సింగ్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. బీజేపీ అంతానికి శంఖం మోగింది. దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి వారి కళ్లల్లో దుమ్ముకొడుతూ ఇన్నాళ్లు ప్రజలను దోపిడీ చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇకనైనా తరిమికొట్టాలని.. దోపిడీ నుంచి విముక్తి పొందాలని పిలుపునిచ్చారు. కాగా, 72 గంటల్లోనే బీజేపీ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరారు.