హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. కరోనా కారణంగా బెయిల్ కుదరదు

by  |
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. కరోనా కారణంగా బెయిల్ కుదరదు
X

న్యూఢిల్లీ: జైలులోకి వెళితే కరోనా వైరస్ సోకి మరణిస్తానని నిందితుడి భయంతో వాదించినంత మాత్రాన అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బెయిల్ మంజూరుకు కరోనా భయం అనేది కారణంగా నిలవబోదని వివరించింది. 130 కేసులున్న ఓ నిందితుడికి ఇదే కారణంతో బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఇతర న్యాయస్థానాలూ ఈ హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ బెయిల్ మంజూరు చేయరాదని ఆదేశించింది. దేశంలో జైళ్లు సామర్థ్యానికి మించిన ఖైదీలతో రద్దీగా మారాయని, గతేడాది పెరోల్ ఇచ్చినవారికీ, సంబంధిత కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.

ఖైదీలకు స్వేచ్ఛ, జీవించే హక్కు ఉంటాయని, వాటిని కాపాడాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవే ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు ఉటంకిస్తూ ఇటీవలే 130 కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రతీక్ జైన్‌కు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. జైలులో అతనికి కరోనా సోకవచ్చునని, తనతో ఇతరులకు, జైలు అధికారులకూ వ్యాపించే ముప్పు ఉందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంటుందని వ్యాఖ్యానించింది. అరెస్టు చేస్తే కరోనా కారణంగా మరణించే ప్రమాదముందని నిందితుడి తరఫు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరగడానికి ముందు నిందితుడు బ్రతికి ఉండాలని, అతనికీ జీవించే హక్కు ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

మహమ్మారి కాలంలో క్రిమినల్ జస్టిస్ అక్కర్లేదా?: యూపీ

హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను ఉత్తరప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కరోనా మహమ్మారి కాలమంతా క్రిమినల్ జస్టిస్ అక్కర్లేదనే అర్థాన్ని ఈ ఆదేశాలు ఇస్తున్నాయని ఆరోపించింది. ఈ కాలంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరిగే అవకాశమిచ్చినట్టువుతుందని, శిక్షకూ భయపడకుండా నేరాలకు పాల్పడే అవకాశాన్ని కల్పించినట్టవుతుందని అత్యున్నత న్యాయస్థానంలో సమర్పించింది. న్యాయం పొందాలనే బాధితుల హక్కుల కంటే బెయిల్ ఇచ్చి నేరగాళ్లకు అధికంగా ఊరటనిచ్చినట్టుగా ఆదేశాలున్నాయని వివరించింది. అంతేకాదు, ఈ కోర్టు తీర్పుతో ఇప్పటికే న్యాయస్థానాల్లో భారీగా పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్ల విచారణపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశమెక్కువ అని తన పిటిషన్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ వాదనతో అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

Next Story

Most Viewed