ప్రపంచమే ఆశ్చర్యపోయే అద్భుతం యాదాద్రి : సీజేఐ

by  |
Supreme-Court-Chief-Justice
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయ కట్టడం ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అద్భుతంగా రూపు దిద్దుకుంటోందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి యాదాద్రి ఆలయ దర్శనానికి సతీసమేతంగా వచ్చిన సీజేఐ, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయంలో కాలుపెట్టగానే పరవశించి పోయానని తెలిపారు. నూతన ఆలయం ప్రారంభం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 99 శాతం పూర్తైన యాదాద్రి ఆలయ జనవరి, ఫిబ్రవరిలో మహాసుదర్శనయాగం జరిపి ప్రారంభంచడానికి ప్రభుత్వం చకచకా పనులు జరుపుతోందని వెల్లడించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి చాలా కళలున్నాయని, వాటిలో సరికొత్త కళల్లో యాదాద్రి ఒకటన్నారు. రూ.790 కోట్లతో నిర్మాణమవుతున్న పనులను ఆరేళ్లలో అనేక పర్యాయాలు దర్శించి చకచకా పూర్తి చేసేలా కృషి చేస్తున్నారన్నారు. తిరుమలలో లాగా.. ఆలయం చుట్టుపక్కల పార్కులను కూడా అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మిస్తున్నండడం తెలంగాణకే గర్వకారణమన్నారు. మహాసుదర్శనయాగం కోసం 3 వేల మంది రుత్వికులను ఆహ్వానించనున్నట్లు తెలిసిందని, రాష్ట్రపతితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలవాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. ఇన్నాళ్లూ కరోనా వల్ల ఆలయం ప్రారంభం కాలేదు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గాయి కాబట్టి.. సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తారని తెలిసిందన్నారు.

ఆలయ ప్రత్యేకతలను చూస్తే..

దీని నిర్మాణానికి నల్లరాయిని వాడినందున ఆలయంలోకి వెళ్లగానే చల్లగా ఉన్న ఫీలింగ్ కలిగిందని, సహజ సూర్యకాంతి లోపలికి ప్రసరించేలా ఏర్పాట్లున్నాయి. మొత్తం 8 మండప ప్రాకారాలున్నాయి. ఆలయం అంతటా కాకతీయ కళాతోరణాలు, దేవతామూర్తులు, అష్టలక్ష్మీ రూపాలతో సాలహారాలు, అళ్వారుల విగ్రహాలు, ప్రహ్లాద చరితం వంటివి అద్భుతంగా ఏర్పాటు చేశారని కొనియాడారు. యాదాద్రిని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. పనుల కోసం యాదాద్రి దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) కూడా ఏర్పాటు చేసి చేపట్టడం ఆమోగమన్నారు. ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి త్వరగా ప్రారంభించాలని ఎదురు చూస్తున్న భక్తుల కోరిక త్వరలో నెరవేరనుందన్నారు. ఆయన వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఈవో గీతారెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed