అరసవల్లిలో అద్భుత దృశ్యం.. చూస్తే అన్ని పాపాలు పోతాయి

by  |
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. చూస్తే అన్ని పాపాలు పోతాయి
X

దిశ,ఉత్తరాంధ్ర : దేశంలోని ప్రసిద్ధ సూర్యభగవానుడి ఆలయాల్లో ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా అరసలవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ రోజున సూర్య కిరణాలు స్వామి వారి పాదాలని తాకి బంగారు ఛాయలో భక్తులకి దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి శ్రీకాకుళంలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్యభగవానుడి ఆలయంగా, దేశంలోని అరుదైన సూర్యభగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలోనే అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు.

ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.


Next Story