ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఆత్మహత్యలు

by  |
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఆత్మహత్యలు
X

ప్రస్తుతం మనుషుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. కుటుంబ కలహాలు, కష్టాలు, హెల్త్ ఇష్యూస్ , ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక కారణాలతో చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 368 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యువత ఆత్మహత్య శాతం చాలా వరకు తగ్గింది. దీనికి కారణం కరోనా కారణంగా పరీక్షలు లేకుండా ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేయడమే. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య పెరగటం గమనార్హం.

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మనసుకు కాస్త బాధ కలిగితే చాలు చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయి క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇంకొదరైతే ఆత్మహత్యకు పాల్పడుతూ వారి కుటుంబాలకు కన్నీటిని మిగిలిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చిన సమయంలో ప్రతి ఏడాదీ జిల్లాలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గతేడాది ఆత్మహత్య చేసుకున్న వారిలో 114 మంది విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించింది. ఈ ఏడాది విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 12కు పడిపోయింది. కరోనా కారణంగా ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసినందు వల్లే ఈ సంఖ్య తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తగ్గిన రైతుల ఆత్మహత్యలు

కొన్ని ఏండ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి నుంచే వర్షాలు సమృద్దిగా కురవడంతో చాలా మంది రైతులు పంటల సాగు చేశారు. భారీ వర్షాలకు కొంత మేర పంట దెబ్బతిన్నా.. కాస్తో కూస్తో దిగుబడి వచ్చింది. వర్షాల కారణంగా ప్రస్తుతం పంటలు నష్టపోయినా.. యాసంగి పంటలైనా పండుతాయిలే అనే ధైర్యం రైతుల్లో కనిపిస్తోంది. ఫలితంగానే ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలో 405మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఈ ఏడాది ఈ సంఖ్య 11కు తగ్గింది. ప్రతి ఏడాదీ వర్షకాలం ప్రారంభం కాగానే పంటల కోసం రైతులు పెద్దఎత్తున అప్పులు తీసుకురావడం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకు పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తోనే ఎక్కువ మంది

రైతులు విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గుమోహం పట్టినా.. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది కుటుంబ కలహాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49మంది ఆత్మహత్య చేసుకోగా ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు 86మంది ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. వీరిలో చాలా మంది లాక్‌డౌన్ సమయంలోనే బలవన్మణానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పుటగడవక చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు ఫ్యామిలీ ప్రబ్లమ్స్ ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హెల్త్ ఇష్యూస్‌తోనూ..

హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సైతం ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఈ ఏడాది ఉహించని రీతిలో పెరిగిపోయింది. హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది 27మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటికే సుమారు 268 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో కరోనా వైరస్ సోకిన తర్వాత ఎదురైన చేదు అనుభావాలతో ఆత్మహత్యకు పాల్పడ్డ వారు సైతం ఉన్నారు. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి లాక్‌డౌన్ సమయంలో సరైన వైద్య సదుపాయాలు అందక ఆందోళనకు గురై మరి కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.

పెరుగుతున్న మానసిక ఆందోళలు

ఆత్మహత్య చేసుకున్న వారిలో చాలా మంది మానసిక ఆందోళనల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణానికి పాల్పడ్డారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. కుటుంబంలో ఎవరైనా వివిధ సమస్యలతో బాధపడుతున్న సమయంలో మిగితా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. చాలా మంది సమస్యలు వచ్చినపుడు ఒంటిరిగా ఉండేందుకు ఇష్టపడతారని, అదే సమయంలో వారి ఆలోచనలు ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిలో వచ్చే మార్పులను సరైన సమయంలో గుర్తిస్తే వారిని కాపాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి వారిని కుటుంబ సభ్యులు, వారి చుట్టూ ఉండే వారు మనసిక ధైర్యం నింపితే.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

Next Story