ఆ సమస్యతో నానా ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులు

by  |
ఆ సమస్యతో నానా ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులు
X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల పరిస్థితి చూస్తే అయ్యో పాపం అని ఎవరికైనా జాలి కలుగుతుంది. ఏకంగా పాఠశాల గేటునే ముసేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు తమ పాఠశాల ప్రహరీని దూకి లోపలికి వెళ్తున్నారు. ఒక్కరిద్దరూ అనుకుంటే పొరపాటే.. ఆ పాఠశాలలో 78 మంది విద్యార్థులు చదువుతున్నారు. సగానికి పైగా బాలికలు ఉన్నారు. నేషనల్ హైవే 167 నాగార్జున సాగర్, మిర్యాలగూడ రోడ్డుకు ఆనుకుని ఉండే ఆ స్కూల్ గ్రౌండ్ ఓ ఐకాన్ లా కనిపిస్తుంది. తమ ఊరి స్కూల్ గ్రౌండ్ ను కూడా ఇలా చేసుకోవాలని అసూయపడని వారు ఉండరంటే నమ్మశక్యం కాదు. పీఈటీ సత్యం నేతృత్వంలో విద్యార్థులు జాతీయ స్థాయిలో 70 మందికి పైగా ఆడారు. రాష్ట్ర స్థాయిలో 100మందికి పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేసి ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు వెళ్లేప్పుడు దొడ్డిదారిన వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జడ్చర్ల నుంచి కోదాడకు రవాణ మార్గం కలిపేందుకు ఎన్ హెచ్ 167 రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో, ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం అండర్ గ్రౌండ్ ద్వారా కాల్వను నిర్మిస్తున్నారు. సరిగ్గా ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల గేటు వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు వచ్చేసరికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించాడు. స్కూల్ ఎదుట ఉన్న జాలు కాల్వను డ్రైనేజీలోకి వెళ్లకుండా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకోకుండా తమ పనులు చేసుకుని వెళ్లారు. జాలు కాల్వ నీరు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో నేరుగా పాఠశాల గ్రౌండ్ లోకి వెళ్లి, బురదగా మారడంతో.. విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతన్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన గ్రామ యువ సర్పంచ్ కేశ శంకర్ పాఠశాల చుట్టూ ఉన్న జాలు కాల్వను జేసీబీతో మరమ్మతులు చేయించారు. కానీ పాఠశాల గేటు ఎదుట శాశ్వత పరిష్కారం కోసం కల్వర్టు నిర్మించాలని సర్పంచ్ కోరుతున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా అనంతరం పాఠశాలలు తెరిచిన నాటి నుంచే విద్యార్థులు ఇలా గోడ దూకి స్కూల్ కు వెళ్తున్నారు.
కాంట్రాక్టర్ పెడ చెవిన పెడుతున్నారు…
మైదానం బురదగా మారుతుండటంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.50 వేల ఖర్చుతో జాలు కాల్వను జేసీబీతో కాల్వ మరమ్మతులు చేయించాను. గేటు ఎదుట గూనలు కానీ, శాశ్వత పరిష్కారం కోసం కల్వర్టు కానీ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
కేశ శంకర్, సర్పంచ్ ముకుందాపురం,
సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు.

Next Story

Most Viewed