ఇలా రోడ్లుంటే చదువు సాగేది ఎలా..?

by  |
ఇలా రోడ్లుంటే చదువు సాగేది ఎలా..?
X

దిశ, బెజ్జూర్ : వర్షాలు విద్యార్థులకు కొత్త కష్టాలు తీసుకొస్తున్నాయి. పాఠశాలకు వెళ్లి వచ్చే విద్యార్థులు బురద రోడ్ల వలన నానా అవస్థలు పడుతున్నారు.కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఎల్కపల్లి, చిన్న సిద్దాపూర్, పెద్ద సిద్ధాపూర్ గ్రామస్తుల బాధ వర్ణనాతీతంగా మారింది.ఈ గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ గ్రామాలను కలిపే రోడ్డు మార్గం పూర్తిగా బురదమయంగా తయారైంది. అయితే, బెజ్జూర్ నుంచి ఎల్కపల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది.

వరుసగా కురుస్తున్న వర్షాలకు మట్టిరోడ్డు కాస్తా బురద మయం కావడంతో ఎల్కపల్లి, చిన్న సిద్ధాపూర్, పెద్ద సిద్ధాపూర్ గ్రామాల విద్యార్థులు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని స్థితిలో ఆ రోడ్డు ఉంది. ఈ గ్రామాల నుంచి ప్రతీరోజు మండల కేంద్రానికి ప్రజలు నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం నిత్యం ప్రజలు వచ్చిపోతుంటారు. స్వరాష్ట్రం సాధించి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సరైన రోడ్డు మార్గం నిర్మాణం చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

Next Story