ఎమ్మెల్సీ కవిత వద్దకు తెయూ పంచాయితీ.. విద్యార్థి సంఘాలకు స్పష్టమైన హామీ

by  |
ఎమ్మెల్సీ కవిత వద్దకు తెయూ పంచాయితీ.. విద్యార్థి సంఘాలకు స్పష్టమైన హామీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ‌లో అక్రమంగా భర్తీ చేస్తున్న పోస్టులు, సమస్యలు, అక్రమాలపై జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీకి గతంలో సాంబయ్య వీసీగా ఉన్నప్పుడు ప్రభుత్వ, పాలక మండలి అనుమతి లేకుండా పోస్టులు భర్తీ చేశారని.. దీనిని వ్యతిరేకించిన విద్యార్థి సంఘాల పోరాటానికి తోడు కవిత చొరవతో రద్దు చేశామని గుర్తు చేశారు.

ప్రస్తుతం కొత్తగా వీసీ బాధ్యతలు స్వీకరించిన రవీందర్ గుప్తా నాలుగు నెలలు గడవక ముందే దాదాపు 130 ఔట్ సోర్సింగ్ పోస్టులను అక్రమంగా భర్తీ చేశారని ఆరోపించారు. ఒక్క పోస్టుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు తీసుకుంటూ.. దాదాపు రూ. 3 కోట్ల వరకు నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయకూడదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఈసీ నోటీస్ ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.

కనీసం తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలిలో చర్చించకుండా వీసీ, రిజిస్ట్రార్‌లు పోస్టులు భర్తీ చేసి అవినీతికి తెరలేపారన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా.. ఎలాంటి ఇంటర్వ్యూ, ఎగ్జామ్ టెస్ట్ లేకుండానే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని కవితకు వివరించారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ కమిటీ వేయించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు జన్నారం రాజేశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు జీవన్, క్రాంతి, మనోజ్, ఆకాష్, సాయిలు, కీర్తి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed