ఏ ఎన్నికైనా ఏ‘మనీ’ చెప్పాలె?

by  |
ఏ ఎన్నికైనా ఏ‘మనీ’ చెప్పాలె?
X

రాష్ర్టంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికతో మొదలుకొని వరుసగా వచ్చిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలన్ని కాసుల చుట్టే తిరిగాయి.. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టగల డబ్బున్న నేతలకు, వ్యాపారులకు మాత్రమే అవకాశం ఇచ్చి ప్రజా సేవకు అంకితమైన సామాన్య కార్యకర్తలను నిరాశపరిచాయి. ఇకా రైతు సొసైటీ ఎన్నికల్లో కూడా రాజకీయ రంగు రుద్ది డబ్బున్న బడా వ్యాపారులను రంగంలో దించడంతో అసలు రైతులకు అవకాశం కరువైంది.

రాష్ర్టంలో ఏ ఎన్నిక వచ్చినా అవి డబ్బున్నా వారికే.. మనకు కాదన్న నైరాశ్యంలోకి సామాన్య కార్యకర్తలను ఆయా రాజకీయ పార్టీలు నెట్టేస్తున్నాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన కాసుల రాజకీయం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలను సైతం వదలకుండా కుదిపేసిన విషయం విదితమే. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి గెలవగల వారికి మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తున్నాయి. అలాంటి వారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో సామాన్య కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీలు, నాయకులు కాసుల వర్షం కురిపించారు. ఇదే ఒరవడిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగింది. డబ్బున్న వ్యాపారులను, నేతలకు ఆయా పార్టీలు టికెట్లు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రజను అంటిపెట్టుకొని ప్రజాసేవకు అంకితమైన కార్యకర్తలు పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా పట్టణాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి డబ్బులు సంపాదించి ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టగలవారికే ఆయా పార్టీలు మద్దతు తెలపడంతో స్థానిక ఎన్నికల్లో కూడా డబ్బున్న బడాబాబులదే పైచేయిగా నిలిచింది. ఇకా ఈ నెల 15న రాష్ర్టవ్యాప్తంగా 32 జిల్లాలో 909 సొసైటీల్లో జరగనున్న సహకార ఎన్నికల్లో సైతం ఆయాపార్టీలు డబ్బున్న బడాబాబులకే అవకాశం ఇవ్వడంతో ఈ ఎన్నికలు కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా మారాయి. ఈ ఎన్నికల్లో రైతులు డబ్బున్న వ్యాపారులతో తలపడడం కష్టతరంగా మారింది. సహకార ఎన్నికల్లో వార్డు నుంచి పోటీ చేయాలంటే రూ. 3 లక్షలు, చైర్మన్ పదవి కోసం సుమారు రూ.30 నుంచి 50 లక్షల వరకు ఖర్చుపెట్టగల వారికి మాత్రమే ప్రధాన పార్టీలు ప్రాధాన్యతనిచ్చాయి. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేని పేద రైతులకు ఈ ఎన్నికలు నిరాశే చూపుతున్నాయి. ఇక డబ్బున్న బడాబాబులతో తలపడాలంటే పేద రైతులు తమకున్న స్థిరాస్తులను తాకట్టు పెట్టి లేదా విక్రయించి ఈ ఎన్నికల్లో ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది.



Next Story

Most Viewed