‘అభయహస్తం’ నిధులు… ఈ ప్రశ్నలకేది బదులు?

by  |
‘అభయహస్తం’ నిధులు… ఈ ప్రశ్నలకేది బదులు?
X

దిశ, మహబూబ్‌నగర్: అభయహస్తం నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం రద్దుతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో స్వశక్తి సంఘాల్లో చేరి పొదుపు చేస్తున్న మహిళలకు ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య పెన్షన్లతో సంబంధం లేకుండా ఈ అభయహస్తం కింద పెన్షన్లు అందించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రతి సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియంగా చెల్లించే విధంగా చేసింది. పొదుపు చేసిన వారు సహజంగా మరణిస్తే రూ.30 వేల ఆర్థిక సాయం, ప్రమాదవశాత్తు అయితే రూ.75 వేలు ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇక 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.500 పెన్షన్ ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏడాదికోసారి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసి 2017 నుండి పూర్తిగా నిలిపివేశారు.

అధికారికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 33,683 మంది లబ్ధిదారులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా వీరికి కూడా ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని సర్కార్ అదేశాలు జారీ చేసింది. ఇంతకాలం లెక్కలను పరిశీలిస్తే ప్రతి ఏటా అందరూ రూ.365 చొప్పున పదేళ్లపాటు ప్రీమియం చెల్లించారు. కేవలం మహబూబ్‌నగర్ జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే 33,683 మంది రూ.365 చొప్పున చెల్లిస్తే ఏడాదికి రూ.1,22,94,295 అవుతుంది. 2009 నుండి ఇప్పటివరకు చూస్తే రూ.12,29,42,950 అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,261 మంది అభయహస్తం అర్హులు ఉండగా పెన్షన్లు మాత్రం అందట్లేదు. రాష్ర్ట వ్యాప్తంగా వివరాలను పరిశీలిస్తే 20.15లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ప్రతి ఏటా రూ.365 ప్రీమియం చెల్లిస్తూనే ఉన్నారు. రూ.467 కోట్లు కార్పస్ ఫండ్ జమ అయ్యింది. 2011-12 నుండి 2107-18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అభయహస్తం పథకంలోని లబ్ధిదారుల వాటా ధనం, ప్రభుత్వ వాటా ధనం పరిశీలిస్తే…

2011-12 రూ. 294,14,14,597.42
2012-13 రూ. 431,79,99,668.09
2013-14 రూ. 563,74,22,215.04
2014-15 రూ. 698,43,54,617.86
2015-16 రూ. 712,28,89,643.00
2016-17 రూ. 771,59,42,337.00
2017-18 రూ. 838,33,71,349.00
గత ఏడేళ్లలో సుమారు 4 వేల కోట్ల రూపాయలు జమా అయ్యాయి. అభయహస్తం పథకం రద్దుతో ఈ నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నిధులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండానే పథకాన్ని రద్దు చేయడంపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిధులను తమకు తిరిగి చెల్లిస్తారా.. లేదా అని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. GO MS NO 36 ప్రకారం 2 ఏళ్లు వరుసగా ప్రీమియం కట్టించుకోనట్లైతే సభ్యురాలి ఖాతా రద్దు అవుతుంది. అయితే 3 ఏళ్ల నుండి ప్రభుత్వం ప్రీమియం కట్టించుకోవడం లేదు. ఇదే టైంలో వీరి నుండి ఇంత కాలం సేకరించిన ఫండ్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉంటే రాష్ర్టవ్యాప్తంగా సేకరించిన నిధుల పరిస్థితి ఏంటి ? పెద్ద మొత్తంలో నిధులు ఏమయ్యాయి దానిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Tags : Mahabubnagar, Andhra Pradesh, 2009, Abhaya Hastham, Beneficiaries, Aasara Pension, Telangana, Corpus Fund

Next Story