స్టీల్, సిమెంట్ అమ్మకాల వృద్ధి సానుకూలం!

by  |
స్టీల్, సిమెంట్ అమ్మకాల వృద్ధి సానుకూలం!
X

దిశ, వెబ్‌డెస్క్: మౌలిక సదుపాయాల నిర్మాణానికి కీలకమైన స్టీల్, సిమెంట్ రంగాల్లో అక్టోబర్ నుంచి మెరుగైన అమ్మకాలు నమోదవుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ సానుకూల పరిణామాలు స్టీల్, సిమెంట్ రంగాల మార్జిన్, వృద్ధి దృక్పథాన్ని పెంచగలవు. ఇటీవల నిర్మాణ, గ్రామీణ వినియోగం వేగంగా పునరుద్ధరణ జరగడంతో ఈ రంగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో వార్షిక ప్రాతిపదికన 10-20 శాతం డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని నెలల లాక్‌డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ తిరిగి తెరుచుకోవడంతోనే డిమాండ్ అధికంగా ఉందని తెలుస్తోంది. ఆటో, పైప్‌లైన్ ప్రాజెక్ట్లు, ఓడల నిర్మాణం, వాహనాలు, నిర్మాణ రంగం వంటి దాదాపు అన్ని రంగాలు అక్టోబర్ నుంచి మెరుగైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందనే నమ్మకముందని జిందాల్ స్టీల్ అండ్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ వీఆర్ శర్మ చెప్పారు. కరోనాకు ముందు స్థాయికి అమ్మకాలు చేరుకున్నాయని జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థ తెలిపింది.

మూడో త్రైమాసికంలో సాధారణ వినియోగ స్థాయిల కంటే కనీసం 7-8 శాతం అధికంగా ఉండొచ్చని, చివరి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే 10 శాతం అధికంగా ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ధోరణి, వ్యక్తిగత గృహ నిర్మాణం లాంటి వాటిలో డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాయని దాల్మియా భారత్ సీఈవో మహేంద్రా సింఘి చెప్పారు. బిజీగా ఉన్న నిర్మాణ రంగంలో సెంటిమెంట్ బలంగా ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే వినియోగం ఇకమీదట మరింత పెరుగుతుందని అంబుజా సిమెంట్స్ సీఈవో నీరజ్ అన్నారు.



Next Story

Most Viewed