ఎంతకూ తెగని ‘భూమి’ పంచాయితీలు

by  |
ఎంతకూ తెగని ‘భూమి’ పంచాయితీలు
X

దిశ, న్యూస్ బ్యూరో:
దేశంలోనే తెలంగాణ రెవెన్యూకు ప్రత్యేక స్థానం ఉంది. వందల చట్టాలు.. అనేక నిబంధనలు ఉన్నాయి. అయితే రెండేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రెవెన్యూ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. సీఎం కేసీఆర్ పలు సభలు, సందర్భాల్లో ఇప్పుడున్న రెవెన్యూ సమూలంగా మార్చేస్తామంటూ ప్రకటించారు. కానీ కాలయాపనతో భూ సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన నిలిచిపోయింది. పార్టు-బీలో పొందుపర్చిన ఏ ఫైలుకూ మోక్షం లభించడం లేదు. దానికి తోడు తహసీల్దార్ల కోర్టులు ఆగిపోయాయి. అనధికారిక ఉన్నతాధికారుల మౌఖిక, సంక్షిప్త సమాచారాలతో ఆర్డీఓలు కూడా అప్పీలు పిటిషన్లను స్వీకరించడం లేదు. ప్రతి శనివారం నడిపే వారి కోర్టులనూ నిలిపివేశారు. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను ఎలాగూ రద్దు చేయడంతో రివిజన్ పిటిషన్ల విచారణ కొనసాగడం లేదు. పూర్తిగా రద్దయ్యింది. రెవెన్యూలో సంస్కరణలను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చర్చకు రాలేదు. ఓ కమిటీ నియామకం లేదు. ఎజెండా లేదు. రెవెన్యూ చట్టంపై ఓ ఔట్‌లైన్ బయటికి రాలేదు. కనీసం రెవెన్యూ అధికారులకే అందించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోపే వచ్చేస్తోందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. అంతా గందరగోళం.. అందుకే భూ సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన తహసీల్దార్ల వరకు జరుగుతోంది. అన్యాయం జరిగిందని భావించిన పట్టాదారులు, భూ యజమానులు అప్పీలుకు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. ఇదిలాగే కొనసాగితే భూదందాల వ్యవహారానికి మరింత తోడ్పాటు అందించినట్లు అవుతుందని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తహసీల్దార్ అధికారాలు కట్!

రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల వరకు చాలా రకాల అధికారాలకు కోత విధిస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా ఆర్డీఓ, అదనపు కలెక్టర్ల కార్యాలయాలకు సామాన్యులు ప్రదక్షిణలు చేయడం సాధ్యమయ్యే పని కాదు. భూ ఆక్రమణలపై నిఘా, నాలా చట్టం అమలు, రైతు సంబంధ వ్యవహారాలు వంటి అంశాలను ఎంపీడీఓలకు ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారం నిజమైతే రెవెన్యూ అధికారుల ఉనికికే ప్రమాదం ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రెవెన్యూ చట్టాల అమలు బాధ్యత ఇప్పటి దాకా ఒకలా, ఇక నుంచి మరోలా ఉండనుంది. అమితే చట్టాలను కొత్త శాఖలకు అప్పగిస్తే అవగాహన కల్పించడం అంత ఈజీ కాదు. పైగా రెవెన్యూ చట్టాలు అనుభవ పూర్వకంగానే అమలు చేయడం సులువు. పుస్తకాల ద్వారా చదువుకోవడంతో వచ్చే అవగాహనతో అమలు చేయడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. వందల్లో చట్టాలు కలిగిన తెలంగాణ ప్రాంతంలో కొత్త శాఖలకు బాధ్యతలంటే సరికొత్త వివాదాలకు తెర తీసినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అదనపు కలెక్టర్ల జాబ్ చార్టు ఏది?

ఇంకా అదనపు కలెక్టర్ల జాబ్ చార్టును రూపొందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి తోడు వారి వేతనాలు కూడా పాత స్థానంలోనే పొందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ఆ క్రమంలో బదిలీ వేటు పడిన కొందరు జాయింట్ కలెక్టర్లకు పోస్టింగు కూడా దక్కలేదని సమాచారం. కనీసం అదనపు కలెక్టర్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి రెవెన్యూ శాఖలో సందిగ్ధత నెలకొంది. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేసి.. వారి స్థానంలో ప్రతి జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించారు. అప్పటి నుంచి ఫైళ్ల విచారణలో గందరగోళం నెలకొన్నది. అదే క్రమంలో ఆర్డీఓలను బదిలీ చేశారు. వారిలోనూ చాలా మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. కొందరికైతే ఆరు నుంచి 8 నెలలైనా పోస్టింగులు లేకుండా ఉన్నారు. అలాగని ఖాళీగా ఉన్న పోస్టులు లేవనుకోవద్దు. చాలా పోస్టింగులు ఇన్ చార్జీల వ్యవస్థలతో నడుస్తున్నాయి. పోస్టింగులు ఇవ్వకపోయినా ఎప్పుడో ఒక రోజు వేతనాలు విడుదల చేయక తప్పదు. అలాంటప్పుడు ఖాళీగా కూర్చోబెట్టే కంటే ఏదో ఒక పోస్టింగు ఇవ్వడం మంచిదే కదా అని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. అయితే రెవెన్యూ మంత్రిత్వ శాఖ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ఉండడం వల్ల ఏ అధికారి కూడా అడిగేందుకు సాహసించడం లేదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

వివాదాల విచారణ జరగట్లే..

కొత్తగా అదనపు కలెక్టర్ల రాకతో వివాదాలపై విచారణ దాదాపుగా నిలిచిపోయింది. కొందరు తహసీల్దార్లు మాత్రమే విచారణ చేస్తున్నారు. అయితే ఆర్డీఓలకు అప్పీలుకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో ఉన్నతాధికారుల మౌఖిక, ఎస్ఎంఎస్‌ల రూపంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దన్న ఆదేశాలు ఉన్నాయి. అప్పీలు దరఖాస్తుల విచారణను నిలిపివేశారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే పలువురు ఆర్డీఓలు విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అక్కడా చిక్కులొస్తున్నాయి. ఆర్డీఓ నిర్ణయాలను రివ్యూ పిటిషన్ వేసుకునేందుకు జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ రద్దయ్యింది. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్లు ఇంకనూ రివ్యూ పిటిషన్ల విచారణ బాధ్యతలను చేపట్టలేదు. ఈ క్రమంలోనే ఆర్డీఓలను ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కొందరు న్యాయవాదులు కోరుతున్నారు. ఒకవేళ విచారణ చేసి నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అన్యాయం జరిగిందని భావించిన పిటిషన్ దారులు, ప్రతివాదులు మరో రివ్యూ పిటిషన్‌కు వెళ్లే అవకాశం లేనప్పుడు తీరని అన్యాయానికి గురయ్యే ఛాన్సు లేకపోలేదు. ఈ క్రమంలోనే కొన్ని ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో వందల సంఖ్యలో పిటిషన్లు పెండింగులో ఉండిపోయాయి. కానీ అధికారాల మార్పిడి, రెవెన్యూ చట్టాల రూపకల్పనలో జరుగుతోన్న జాప్యం కారణంగా నిలిచిపోయిన విచారణను ప్రజలు గుర్తించడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి అంటూ తిట్టిపోస్తున్నారు.

ఉద్యోగులపై విశ్వాసం పోతోంది!

రెవెన్యూ సంస్కరణలను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కానీ ఎడతెగని జాప్యం కారణంగా ఉద్యోగులపై ప్రజలకు నమ్మకం పోతోందని రెవెన్యూ యంత్రాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అవినీతిరహిత పాలనకు దోహదపడే వ్యవస్థ రూపకల్పన త్వరితగతిన సాగాలంటున్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు, ప్రచారంలో ఉన్న రెవెన్యూ ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా త్వరితగతిన దరఖాస్తు దారులకు న్యాయం దొరుకుతుందనుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదంటున్నారు. మరో వైపు వీఆర్వోల వ్యవస్థ రద్దు అంటూ మంత్రులు కూడా గందరగోళాన్ని సృష్టిస్తుండడంతో అభద్రతాభావం నెలకొందంటున్నారు. కేవలం కొందరు అవినీతి అధికారుల కారణంగానే పూర్తిగా మార్చాలన్న ప్రతిపాదన సరైంది కాదన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలులో సాగుతోన్న జాప్యం కారణంగా జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా త్వరితగతిన అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి చట్టాన్ని రూపొందించాలని కోరుతున్నారు.

భూ వివాదాల వివరాలు
జిల్లాల వారీగా వివాదాలు
రెవెన్యూ కోర్టు కేసుల సంఖ్య: 3,165
వివాదంలోని సర్వే నంబర్ల సంఖ్య: 9,691
తహసీల్దార్ల వద్ద ఉన్న కేసులు: 290
ఆర్డీఓల వద్ద ఉన్న కేసులు: 953
జాయింట్ కలెక్టర్ల కోర్టుల్లో సంఖ్య: 799
కమిషనర్ ఆఫ్ అప్పీల్ కోర్టు: 73
నోట్: ఇవన్నీ విచారణలోని కేసుల సంఖ్య మాత్రమే. కొన్ని జిల్లాల్లో డేటా విచారణలో ఉన్నట్లు చూపడం లేదు. దాన్ని బట్టి ఆయా జిల్లాల్లో విచారణ నిలిచిపోయిందని భావిస్తున్నారు.



Next Story

Most Viewed