వలస కార్మికుల్ని ఆపేందుకు మంచి ఉపాయం

by  |
వలస కార్మికుల్ని ఆపేందుకు మంచి ఉపాయం
X

– భవన నిర్మాణ పనులకు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్
– మార్గదర్శకాల జారీ

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇంటిబాట పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది. భవన నిర్మాణాలు, ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడ ఆగిపోతాయనే ఆందోళన ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే సుమారు 1200 మంది జార్ఖండ్ కార్మికులు ప్రత్యేక రైల్లో స్వంత రాష్ట్రానికి వెళ్ళిపోయారు. దీంతో సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ కొత్త భవనాల నిర్మాణం పనులు ఆగిపోయాయి. ఇలాంటి వేలాది భవనాల నిర్మాణాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కార్మికులంతా వెళ్ళిపోతే ఒక్కసారికి భవన నిర్మాణాలు ఆగిపోయి రియల్ ఎస్టేట్‌పై ప్రభావం పడుతుందని గ్రహించిన మంత్రి కేటీఆర్.. ఒకవైపు బిల్డర్లు, రియల్టర్లతో సమావేశం కావడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా తక్షణం భవనాల, ప్రాజెక్టుల నిర్మాణపు పనుల్ని ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సడలింపులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి కలిసొచ్చింది. దీంతో భవన నిర్మాణ సైట్ల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

హైదరాబాద్ నగరంలో పశ్చిమ దిక్కున శేరిలింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో వేలాది భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈ రంగంలో సుమారు ఐదారు లక్షల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఆ సైట్లలోని క్యాంపుల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. కొన్నిచోట్ల బిల్డర్లు వారికి భోజన సౌకర్యం కల్పించినా చాలాచోట్ల పస్తులతోనే ఉండాల్సి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ చొరవ తీసుకుని ఆహారపు పొట్లాలను అందించే ఏర్పాట్లు చేసింది. అప్పటికీ చాలా మందికి అందకపోవడంతో కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి వస్తోంది. లాక్‌డౌన్ మొదలై నెల రోజులు దాటినా ఇప్పటికీ తిండి దొరకడంలేదని ట్విట్టర్ ద్వారా చెబుతూనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు సొంతూళ్ళకు వెళ్ళవచ్చంటూ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేయడంతో వీరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది.

కానీ సరిగ్గా ఈ వెసులుబాటే తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తీసుకొచ్చింది. ఇప్పుడు కార్మికులు వెళ్ళిపోతే నిర్మాణపు పనులు ఆగిపోతాయన్న భయంతో వారిని వెంటనే పనిలోకి దింపడమే మేలని భావించింది. పనిలో పడితే సొంతూళ్ళకు వెళ్ళాలనే ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటోంది. అందుకే మార్గదర్శకాలను తయారుచేసి అందుబాటులో ఉన్న కార్మికులతో పనులను షురూ చేయాలని ఆదేశించింది. పెద్దపెద్ద నిర్మాణాలు జరిగే ప్రాంతంలో కార్మికుల కోసం క్యాంపులు ఉంటేనే ఇప్పుడు పనులను ప్రారంభించాలని, బయట నుంచి కార్మికులను తీసుకురావాల్సిన భవనాల పనులు మాత్రం ఇప్పుడే వద్దని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. మార్గదర్శకాల్లో మొత్తం 25 జాగ్రత్తలను పేర్కొన్నారు. శానిటైజర్లు మొదలు పనిలోకి వెళ్ళే ప్రతీ కార్మికుడికి థర్మల్ స్కానింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. పని స్థలాల్లో తంబాకు, పాన్, గుట్కా లాంటివి తిని ఉమ్మి వేయరాదని, విధిగా చేతులకు గ్లౌజులు వేసుకోవాలని, ముఖానికి మాస్కు ధరించాలని, డాక్టర్ల/ఆస్పత్రుల పేర్లతో బోర్డును నెలకొల్పాలని, పని స్థలం దాటి కార్మికులు బయటకు వెళ్ళరాదని.. ఇలా అనేక ఆంక్షల్ని ఆ మార్గదర్శకాల్లో పొందుపరిచింది.

Tags: Telangana, Construction Workers, Activities, KTR, Municipal Administration

Next Story