శ్రీధర్ బాబుకు నో ఛాన్స్?

by  |
శ్రీధర్ బాబుకు నో ఛాన్స్?
X

దిశ, కరీంనగర్: కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఏండ్ల తరబడి విధేయతను చాటుకుంటున్న దుద్దిళ్ల కుటుంబానికి చెందిన శ్రీధర్ బాబు.. గులాబీ పార్టీకి జై కొట్టడం ఇక అసాధ్యమేనా? మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లోకి తన రాకను స్వాగతిస్తున్న ఆ పార్టీ కీలక నేత కూడా.. ప్రస్తుతం ఈ విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకున్నారా..? ఇంతకీ తెరవెనక ఏం జరిగింది..? బాబుకు చెక్ పెట్టిందెవరు..? ఆ నేతను ఒప్పించిందెవరు..?

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ’ అనే పాట.. ఆ సీనియర్ ప్రజాప్రతినిధికి అచ్చుగుద్దినట్టు సరిపోతుందేమో. ట్రాక్ ఎక్కిన రైలు మళ్లీ సడెన్‌గా పట్టాలు తప్పడం అంటే ఇదేనేమో ! పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం.. అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయనుకున్న శ్రీధర్ బాబుకు చివరి క్షణంలో చెక్ పడిందట. గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించి.. చివరకు కేటీఆర్ వద్ద డోర్స్ క్లోజ్ అయ్యేలా చేశాయట. ప్రస్తుతం ఈ టాపిక్‌పైనే టీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయమైన పరిస్థితుల దృష్ట్యా శ్రీధర్‌బాబు పార్టీ ఫిరాయిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తోనూ చర్చలు జరిగాయని, ఆయన కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు బలాన్ని చేకూర్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున స్థానిక ఎమ్మెల్యే హోదాలో కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన శ్రీధర్ బాబు ప్రేక్షక పాత్ర వహించారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు ప్రయారిటీ ఇచ్చారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు మాత్రం కేసీఆర్.. ప్రత్యేకంగా శ్రీధర్ బాబును ‘ముందుకు రా..’ అంటూ పిలవడంతో ఆయన పార్టీ మారే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ వర్గాలు కూడా శ్రీధర్ బాబు వస్తే తమకేం నష్టం లేదు, ఇక్కడ లీడర్ మాత్రం పుట్ట మధన్ననే’ అంటూ తమ గ్రూపుల్లో కామెంట్స్ పెట్టారు. దీంతో శ్రీధర్ బాబు చేరిక లాంఛనప్రాయమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. శ్రీధర్ బాబు మాత్రం తాను టీఆర్ఎస్‌లో చేరడం లేదని ఓ ప్రకటన జారీ చేయించారు. కర్ణాటకలోని గానుగాపురం దత్తాత్రేయ ఆలయంలో తన కొడుకు వడక లగ్నంలో బిజీగా ఉన్న శ్రీధర్ బాబు ఈ ప్రకటన ఇవ్వాలని మంథని కాంగ్రెస్ నాయకుడు శశిభూషణ్ కాచేకు చెప్పడంతో ఆయన చేరడం లేదని అనుకున్నారంతా. దీంతో అప్పటి వరకూ జరిగిందంతా వట్టి ప్రచారమేనని భావించాల్సి వచ్చింది.

తెరవెనక చక్రం తిప్పిందెవరు..?

టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న శ్రీధర్ బాబు కారెక్కేందుకు అన్ని శక్తులు కలిసి వచ్చినా.. ఓ రెండు శక్తులు మాత్రం అందుకు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేశాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. అప్పటి వరకు టీఆర్‌ఎస్‌లోకి శ్రీధర్ బాబు ఎంట్రీని కాంక్షించిన కేటీఆర్.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల కారణంగానే సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. సదరు నేతలు శ్రీధర్ బాబు టీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల జరిగే లాభ నష్టాలతోపాటు, పలు వివరాలతో కూడిన ఓ లేఖను కేటీఆర్ ముందుంచారని సమాచారం. ఆ వివరాలన్నీ పరిశీలించిన కేటీఆర్ ‘డోంట్ వర్రీ డోర్స్ క్లోజ్ ఫర్ శ్రీధర్ బాబు జాయినింగ్’ అని మాట ఇచ్చేశారట. ఈ కారణంగానే శ్రీధర్ బాబు గులాబీ ప్రవేశానికి బ్రేకులు పడ్డాయని విశ్వసనీయ సమాచారం.

మౌనమే నా భాష..

అయితే, శ్రీధర్ బాబు కాంగ్రెస్ వీడుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా.. ఆయన మాత్రం నేరుగా మీడియా ముందు మాట్లాడటం లేదు. ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నారు. తన అనచరునితో మీడియాలో ఓ ప్రకటన చేయించారే తప్ప.. ఆయన మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. డీసీసీ అధ్యక్షునిగా, విప్‌గా, మంత్రిగా ఉన్నప్పుడు తరచూ మీడియాలో కనిపించిన శ్రీధర్ బాబు.. ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు..? తన చేరికపై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న పార్టీ సీనియర్లను వేధిస్తోంది. శ్రీధర్ బాబు మౌనం వెనక ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కక కాంగ్రెస్ సీనియర్లు తర్జన భర్జన పడుతున్నారు. అటు స్వంత పార్టీ వర్గాల్లోనూ.. ఇటు రాజకీయ క్షేత్రంలోనూ పార్టీ మారే విషయంపై స్పష్టత ఇవ్వకుండా శ్రీధర్ బాబు దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags : TRS, Congress, Sridhar Babu, Putta Madhu, KTR, KCR, Manthani

Next Story