17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జైశ్వాల్.. ఇంకా ఏయే ఏయే రికార్డులు సాధించాడంటే?

by Dishanational3 |
17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జైశ్వాల్.. ఇంకా ఏయే ఏయే రికార్డులు సాధించాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌ల సహాయంతో 209 పరుగులు చేశాడు. జైశ్వాల్ ద్విశతకం కొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరోవైపు, జైశ్వాల్ డబుల్ సెంచరీ బాది టెస్టుల్లో పలు రికార్డులు సాధించాడు. అందులో కొన్ని అరుదైన రికార్డులు కూడా ఉన్నాయి.

22 ఏళ్ల జైశ్వాల్ భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో అతిపిన్న వయసులో డబుల్ సెంచరీ బాదిన జాబితాలో అతను వినోద్ కాంబ్లే, సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. వినోద్ కాంబ్లే 21 ఏళ్ల 35 రోజుల వయసులో 1993లో ఇంగ్లాండ్‌పై ద్విశతకం నమోదు చేయగా.. గవాస్కర్ 21 ఏళ్ల 238 రోజుల వయసులో వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ కొట్టాడు. అలాగే, భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన 4వ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌గా జైశ్వాల్ ఘనత సాధించాడు. సౌరవ్ గంగూలీ, వినోద్ కాంబ్లే, గౌతమ్ గంభీర్ తర్వాత అతను ఈ జాబితాలో చేరాడు. చివరిసారిగా 2007లో గంగూలీ(239) పాకిస్తాన్‌పై డబుల్ సెంచరీ చేయగా.. 17 ఏళ్ల తర్వాత జైశ్వాల్ ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు.

అంతేకాకుండా, జైశ్వాల్ తన 10వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే తొలి డబుల్ సెంచరీ బాదాడు. దీంతో టెస్టుల్లో ఇన్నింగ్స్‌ల ఆధారంగా తొలి ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన 5వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. కరుణ్ నాయర్ 3 ఇన్నింగ్స్‌తో టాప్ పొజిషన్‌లో ఉండగా.. ఆ జాబితాలో వినోద్ కాంబ్లే(4), సునీల్ గవాస్కర్(8), మయాంక్ అగర్వాల్(8), చతేశ్వర్ పుజారా(9) తర్వాత జైశ్వాల్ ఉన్నాడు. అలాగే, ఇంగ్లాండ్‌పై ద్విశతకం కొట్టిన 9వ భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో కరుణ్ నాయర్, విరాట్ కోహ్లీ, వినోద్ కాంబ్లే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, పుజారా, మాన్సూర్ అలీ ఖాన్ ఇంగ్లాండ్‌పై డబుల్ సెంచరీ కొట్టారు.



Next Story

Most Viewed