WTC Final 2023: నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగిన భారత్, ఆసీస్ ప్లేయర్స్.. ఎందుకంటే..?

by Disha Web Desk 13 |
WTC Final 2023: నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగిన భారత్, ఆసీస్ ప్లేయర్స్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లో ఓవల్ వేదికగా బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు అంపైర్లు, మ్యాచ్ అధికారులు నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగారు. ఒడిశా రైలు ప్రమాద మృతులకు సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఇలా నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళులు అర్పించారు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యల కారణంగా మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో సుమారు 250 మంది ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా ప్రమాదంలో మృతి చెందినవారికి టీమిండియా నివాళులర్పించిందని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి టీమిండియా సంతాపం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన రోహిత్.. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే తప్పని పరిస్థితుల్లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. ఇక అందరూ ఊహించనట్లుగానే టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌ శార్దూల్ ఠాకూర్‌తో బరిలోకి దిగగా.. మూడో పేసర్‌గా ఉమేశ్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ అనుభవానికి ఓటేసిన టీమ్ మేనేజ్‌మెంట్ యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది.

Next Story