కీలక పోరులో తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం

by Harish |
కీలక పోరులో తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. మరో ఫైనల్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఆ జట్టు ముంబై ముందు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.

ఎలీస్ పెర్రీ(66) హాఫ్ సెంచరీతో సత్తాచాటడంతో ఆ జట్టు పోరాడే స్కోరు సాధించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన(10), సోఫి డివైన్(10), దిశా కసత్(0), రిచా ఘోష్(14), మోలినెక్స్(11) నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో ఎలీస్ పెర్రీ ఒంటరి పోరాటం చేసింది. ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆమె.. మరో ఎండ్ వికెట్లు పడుతున్నా జట్టుకు మంచి స్కోరు అందించేందుకు కష్టపడింది. సైకా ఇషాక్ వేసిన చివరి ఓవర్‌లో పెర్రీ క్యాచ్ అవుటవడంతో ఆమె పోరాటానికి తెరపడింది. జార్జియా వారేహమ్(18 నాటౌట్), శ్రేయాంక పాటిల్(3 నాటౌట్) అజేయంగా నిలిచారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్ బ్రంట్, సైకా ఇషాక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Next Story