ముంబైకి షాకిచ్చిన ఆర్సీబీ.. ఫైనల్‌లో అడుగు

by Harish |
ముంబైకి షాకిచ్చిన ఆర్సీబీ.. ఫైనల్‌లో అడుగు
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. గ్రూపు దశలో అగ్రస్థానంతో ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేస్తూ బెంగళూరు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఢిల్లీ వేదికగా శుక్రవారం ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబైపై 5 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 135/6 స్కోరు చేసింది. ఎలీస్ పెర్రీ(66) అద్భుత పోరాటంతో ఆ జట్టును ఆదుకుంది. అనంతరం గొప్పగా పోరాడిన ఢిల్లీ బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. దీంతో ఛేదనలో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 130/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(33), అమేలియా కెర్(27) పోరాటం ఫలించలేదు. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలనుకున్న ముంబై ఆశలు ఆవిరయ్యాయి. బెంగళూరు తొలిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య ఢిల్లీ వేదికగా ఫైనల్ జరగనుంది.

ముంబైని కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు

136 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ గెలుస్తుందన్న అంచనాలు చాలా తక్కువ. కానీ, ఆ జట్టు బౌలర్లు ఆఖర్లో గొప్పగా పోరాడారు. ఛేదనలో ముంబైకి ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు యాస్తికా భాటియా(19), హేలీ మాథ్యూస్(15)‌ స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. నాట్ స్కివర్ బ్రంట్(23) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకుంది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(33), అమేలియా కెర్(27 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్ది జట్టును విజయానికి చేరువ చేశారు. 116/3 స్కోరుతో నిలిచిన ముంబైకి చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఆర్సీబీ బౌలర్లు అద్బుతం చేశారు. 18వ ఓవర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను శ్రేయాంక అవుట్ చేసి దెబ్బకొట్టింది. 19వ ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చిన మోలినెక్స్ సజన(1)ను పెవిలియన్ పంపింది. ఇక, చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. అద్భుతంగా బౌలింగ్ వేసిన ఆశా శోభన పూజ వస్త్రాకర్(4)ను అవుట్ చేయడంతోపాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ విజయం లాంఛనమైంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీయగా.. పెర్రీ, మోలినెక్స్, వారేహమ్, ఆశా శోభనలకు చెరో వికెట్ దక్కింది.

ఆదుకున్న పెర్రీ

అంతకుముందు ఆర్సీబీ 135 పరుగులు చేసిందంటే కారణం ఎలీస్ పెర్రీ. ఆమె పోరాటంతోనే బెంగళూరు పోరాడే స్కోరు సాధించింది. ఒక దశలో ఆ జట్టు 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందోమో అనిపించింది. కెప్టెన్ స్మృతి మంధాన(10), సోఫి డివైన్(10), దిశ కసత్(0), రిచా ఘోష్(14) నిరాశపర్చడంతో ఆర్సీబీ 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో పెర్రీ గొప్ప పోరాట పటిమ కనబర్చింది. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆమె హాఫ్ సెంచరీతో మెరిసింది. మోలినెక్స్(11), వారేహమ్(18 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పింది. ముంబై బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 135/6(20 ఓవర్లు)

స్మృతి మంధాన(సి)షబ్నిమ్ ఇస్మాయిల్(బి)నాట్ స్కివర్ బ్రంట్ 10, సోఫి డివైన్(బి) హేలీ మాథ్యూస్ 10, ఎలీస్ పెర్రీ(సి)నాట్ స్కివర్ బ్రంట్(బి)సైకా ఇషాక్ 66, దిశా కసత్(సి)పూజ(బి)సైకా ఇషాక్ 0, రిచా గోష్(సి)నాట్ స్కివర్ బ్రంట్(బి)హేలీ మాథ్యూస్ 14, మోలినెక్స్(బి)నాట్ స్కివర్ బ్రంట్ 11, వారేహమ్ 18 నాటౌట్, శ్రేయాంక పాటిల్ 3 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 20-1, 20-2, 23-3, 49-4, 84-5, 126-6

బౌలింగ్ : షబ్నిమ్ ఇస్మాయిల్(4-1-30-0), హేలీ మాథ్యూస్(4-0-18-2), నాట్ స్కివర్ బ్రంట్(4-0-18-2), సైకా ఇషాక్(3-0-27-2), పూజ వస్త్రాకర్(3-0-21-0), అమేలియా కెర్(2-0-18-0)

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 130/6(20 ఓవర్లు)

యాస్తికా భాటియా(సి)ఎలీస్ పెర్రీ 19, హేలీ మాథ్యూస్(సి)వారేహమ్(బి)శ్రేయాంక 15, నాట్ స్కివర్ బ్రంట్(బి)వారేహమ్ 23, హర్మన్‌ప్రీత్ కౌర్(సి)డివైన్(బి)శ్రేయాంక 33, అమేలియా కెర్ 27 నాటౌట్, సజన(స్టంప్)రిచా ఘోష్(బి)మోలినెక్స్ 1, పూజ(స్టంప్)రిచా ఘోష్(బి)ఆశా శోభన 4, అమన్‌జోత్ కౌర్ 1 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 27-1, 50-2, 68-3, 120-4, 123-5, 128-6

బౌలింగ్ : రేణుక(1-0-6-0), శ్రేయాంక(4-0-16-2), సోఫి డివైన్(1-0-9-0), ఎలీస్ పెర్రీ(4-0-29-1), మోలినెక్స్(4-0-16-1), వారేహమ్(4-0-37-1), ఆశా శోభన(2-0-13-1)

Next Story