బంతితో చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన ముంబై

by Harish |
బంతితో చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన ముంబై
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ఢిల్లీ వేదికగా మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. బెంగళూరు నాకౌట్ ఆశలు ఈ మ్యాచ్‌తో ముడిపడి ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు బౌలింగ్‌లో సత్తాచాటింది. ముంబైని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 19 ఓవర్లలో 113 పరుగులు చేసి కుప్పకూలింది.

ఎల్లీస్ పెర్రీ పేస్ ధాటికి ముంబై విలవిలలాడింది. ఆ జట్టు బ్యాటర్లు క్రీజలు నిలువలేకపోయారు. ఓపెనర్ సజన చేసిన 30 పరుగులే టాప్ స్కోర్. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డకౌటై దారుణంగా నిరాశపరిచింది. నాట్ స్కివర్ బ్రంట్(10), అమేలియా కెర్(2), అమన్‌జోత్ కౌర్(4), పూజ వస్త్రాకర్(6) తేలిపోయారు. దీంతో ముంబై జట్టు బెంగళూరు ముందు 114 పరుగుల స్వల్ప లక్ష్యమే నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ 6 వికెట్లతో విజృంభించి ముంబై పతనాన్ని శాసించింది. సోపి డివైన్, శోభన, శ్రేయాంక పాటిల్, మోలినెక్స్‌లకు చెరో వికెట్ దక్కింది.

Next Story