ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై విజయం.. చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన సజన

by Harish |
ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై విజయం.. చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన సజన
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ విజయంతో ఆరంభించింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంచలన విజయం సాధించి టోర్నీలో తొలి మ్యాచ్‌తోనే ఖాతా తెరిచింది. గత సీజన్‌ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఢిల్లీ పోరాడి ఓడింది. శుక్రవారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి సజన సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ముందు 172 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. ఛేదనలో ముంబైకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో రెండో బంతికే ఓపెనర్ హేలీ మాథ్యూస్(0) డకౌటైంది. అనంతరం యాస్తికా భాటియా ఇన్నింగ్స్ నిర్మించగా.. మరో ఎండ్‌లో నాట్ స్కివర్ బ్రంట్(19) త్వరగానే అవుటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌(55), యాస్తికా భాటియా(57) కలిసి జట్టును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. కొంతకొలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన హర్మన్‌ప్రీత్ ఈ మ్యాచ్‌లో సత్తాచాటింది. యాస్తికా భాటియా అవుటవడంతో ఈ జోడీ విడిపోగా.. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ ఒంటరి పోరాటం చేసింది. అమేలియా కెర్(24) తక్కువ స్కోరు అవుటైన ఆమె సహకారంతో హర్మన్‌ప్రీత్ జట్టును లక్ష్యం దిశగా నడిపించింది. ఇక, చివరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు అవసరమవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలి బంతికే పూజ వస్త్రాకర్(1) వికెట్ పారేసుకోగా.. నాలుగో బంతికి ఫోర్ కొట్టిన హర్మన్‌ప్రీత్ ఐదో బంతికి క్యాచ్ అవుటైంది. ఇక, ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులోకి వచ్చిన సజన(6 నాటౌట్) సిక్స్ కొట్టడంతో ముంబై విజయం లాంఛనమైంది. నిర్ణీత ఓవర్లలో ముంబై జట్టు 6 వికెట్లను కోల్పోయి 173 పరుగులు చేసి గెలుపొందింది. ఢిల్లీ బౌలర్లలో అరుంధతి, ఎలీస్ క్యాప్సే రెండేసి వికెట్లు తీయగా.. మారిజన్నె కాప్, శిఖా పాండే తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఎలీస్ క్యాప్సే, రోడ్రిగ్స్ మెరుపులు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ(1) దారుణంగా నిరాశపర్చింది. ఆ తర్వాత క్రీజులోకి ఎలీస్ క్యాప్సే కీలక ఇన్నింగ్స్ ఆడింది. హాఫ్ సెంచరీతో మెరిసి ఆమె.. మొదట మరో ఓపెనర్ మెగ్ లాన్నింగ్‌(31)తో కలిసి రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. ఆ తర్వాత ఎలీస్ క్యాప్సేకు జెమీమా రోడ్రిగ్స్‌ తోడైంది. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఎలీస్ క్యాప్సే(75)ను అమేలియ కెర్ వికెట్లు ముందు దొరకబుచ్చుకుంది. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రోడ్రిగ్స్(42) సైతం వికెట్ పారేసుకుంది. ఇక, చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి మారిజన్నె కాప్(16) అవుటవ్వగా.. నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ జట్టు 171/5 స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్, అమేలియ కెర్ రెండేసి వికెట్లు తీయగా.. షబ్నిమ్ ఇస్మాయిల్‌కు ఒక వికెట్ దక్కింది.

గ్రాండ్ వెల్‌కమ్

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్‌ ఖాన్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్‌ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో స్టేడియం హోరెత్తింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. జవాన్ మూవీలోని ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ఐదు జట్ల కెప్టెన్‌లతో కలిసి ఆవిష్కరించాడు. అనంతరం కెప్టెన్లతో కలిసి షారుఖ్ ఖాన్ స్టెప్పులు వేశాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఐపీఎల్‌ చైర్మన్ అరుణ్‌ ధుమాల్ పాల్గొన్నారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ ఇన్నింగ్స్ : 171/5(20 ఓవర్లు)

మెగ్ లాన్నింగ్(సి)సజన(బి)నాట్ స్కివర్ బ్రంట్ 31, షెఫాలీ వర్మ(బి)షబ్నిమ్ ఇస్మాయిల్ 1, ఎలీస్ క్యాప్సే ఎల్బీడబ్ల్యూ(బి)అమేలియ కెర్ 75, రోడ్రిగ్స్(సి)యాస్తికా భాటియా(బి)నాట్ స్కివర్ బ్రంట్ 42, మారిజన్నె కాప్(స్టంఫ్)యాస్తికా భాటియా(బి)అమేలియా కెర్ 16, సదర్లాండ్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 5.

వికెట్ల పతనం : 3-1, 67-2, 141-3, 155-4, 171-5

బౌలింగ్ : షబ్నిమ్ ఇస్మాయిల్(4-0-24-1), సైకా ఇషాక్(3-0-17-0), నాట్ స్కివర్ బ్రంట్(4-0-33-2), అమేలియ కెర్(4-0-43-2), కీర్తన(1-0-13-0), హేలీ మాథ్యూస్(2-0-21-0), పూజ వస్త్రాకర్(2-0-18-0)

ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ఇన్నింగ్స్ : 173/6(20 ఓవర్లు)

హేలీ మాథ్యూస్(సి)తానియా(బి)మారిజన్నె కాప్ 0, యాస్తికా భాటియా(సి)మారిజన్నె కాప్(బి)అరుంధతి 57, నాట్ స్కివర్ బ్రంట్(బి)అరుంధతి 19, హర్మన్‌ప్రీత్(సి)సదర్లాండ్(బి)ఎలీస్ క్యాప్సే 55, అమేలియా కెర్(బి)శిఖా పాండే 24, పూజ వస్త్రాకర్(సి)అరుంధతి(బి)ఎలీస్ క్యాప్సే 1, అమన్‌జోత్ కౌర్ 3 నాటౌట్, సజన 6 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 0-1, 50-2, 106-3, 150-4, 160-5, 167-6

బౌలింగ్ : మారిజన్నె కాప్(4-1-32-1), శిఖా పాడే(4-0-32-1), సదర్లాండ్(4-0-38-0), అరుంధతి(4-0-27-2), ఎలీస్ క్యాప్సే(2-0-23-2), రాధా యాదవ్(2-0-18-0)



Next Story

Most Viewed