ఢిల్లీతో తలపడే జట్టేదో?.. రేపు ఎలిమినేటర్‌లో ముంబై, బెంగళూరు ఢీ

by Harish |
ఢిల్లీతో తలపడే జట్టేదో?.. రేపు ఎలిమినేటర్‌లో ముంబై, బెంగళూరు ఢీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2 ముగింపు దశకు వచ్చింది. గ్రూపు దశ మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఎలిమినేటర్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మరో ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు శుక్రవారం ఢిల్లీ వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ప్రారంభ సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌ బెర్త్‌పై కన్నేసింది. ఆరంభ ఎడిషన్‌లో గ్రూపు దశలోనే వెనుదిరిగిన బెంగళూరు ఈ సారి సత్తాచాటుతూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అదే పట్టుదలతో టైటిల్ పోరుకు అర్హత సాధించాలనుకుంటన్నది.

ముంబై జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొదటి నుంచి జోరు ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, యాస్తికా భాటియా, అమేలియా కెర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్ బ్రంట్, పూజ వస్త్రాకర్, అమన్‌జోత్ కౌర్ నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. ఫైనల్‌లో వీరి నుంచి జట్టు చక్కటి ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. బౌలర్లలో సైకా ఇషాక్, షబ్నిమ్ ఇస్మాయిల్ వంటి నాణ్యమైన బౌలర్లను కలిగి ఉండగా.. అమేలియా కెర్, నాట్ స్కివర్ బ్రంట్ బంతితోనూ మంచి ప్రదర్శన చేశారు. మరోవైపు, ఈ సారి బెంగళూరు జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తున్నది. కెప్టెన్ స్మృతి మంధాన, ఎలీస్ పెర్రీ, రిచా గోష్ ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధాన బలం. అలాగే, బౌలర్లలో ఆశా శోభన, సోఫి మోలినెక్స్ ముంబై బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. శ్రేయాంక పాటిల్, ఎలిస్ పెర్రీ, సోఫి డివైన్ సైతం ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో నెగ్గాయి. మొత్తంగా నాలుగుసార్లు తలపడితే ముంబై మూడింట గెలుపొందగా.. ఆర్సీబీ ఒక్కసారి విజయం సాధించింది. మరి, ఎలిమినేటర్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

Next Story