ఎవరీ శోభనా ఆశ?.. ట్రెండింగ్‌లో కేరళ యువతి

by Harish |
ఎవరీ శోభనా ఆశ?.. ట్రెండింగ్‌లో కేరళ యువతి
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంలో స్పిన్నర్ శోభనా ఆశ కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విజృంభించిన ఆమె ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన రికార్డుకెక్కింది. ఒకే ఒక్క ప్రదర్శనతో శోభనా ఆశ ఒక్కసారిగా మహిళల క్రికెట్‌లో సంచలనంగా మారింది. దీంతో శోభన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

కేరళలోని త్రివేండ్రంలో 1991లో శోభనా ఆశ జన్మించింది. ఆమె తండ్రి డ్రైవర్. పేద కుటుంబంలో పుట్టిన శోభనకు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో శోభన క్రికెట్‌ వైపు అడుగులు వేసింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌ ఆమె స్ఫూర్తి నింపింది. ఈ క్రమంలో 13 ఏళ్ల వయసులో శోభన త్రివేండ్రమ్ తరపున క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఆమెకు ఫేవరెట్ క్రికెటర్. దేశవాళీ క్రికెట్‌లో కేరళ, పుదుచ్చేరి, రైల్వేస్ తరపున ప్రాతినిధ్యం వహించింది. 32 ఏళ్ల శోభన దేశవాళీలో ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసింది.

గతేడాది ప్రారంభ డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు జట్టు శోభనను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఐదు వికెట్లు పడగొట్టింది. రెండో సీజన్‌కు కూడా ఫ్రాంచైజీ ఆమెను అంటిపెట్టుకుంది. ఈ సీజన్‌లోనూ ఫ్రాంచైజీ ఆమె అంటిపెట్టుకుంది. రెండో సీజన్‌ను ఆమె అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టింది. మిగతా మ్యాచ్‌ల్లోనూ శోభన అదరగొడితే జాతీయ జట్టుకు కూడా ఎంపిక అవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed