ద్రవిడ్‌ను మరిపిస్తాడా?. గంభీర్ ముందున్న సవాళ్లు ఇవే

by Harish |
ద్రవిడ్‌ను మరిపిస్తాడా?. గంభీర్ ముందున్న సవాళ్లు ఇవే
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. అతని హయాంలో గత 12 నెలల్లో టీమ్ ఇండియా మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం చిన్న విషయం కాదు. టీ20 వరల్డ్ కప్ విజయంతో ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌ స్థాయిని మరింత పెంచాడు. కాబట్టి, ద్రవిడ్ వారసత్వాన్ని కొనసాగించడం గంభీర్‌కు అంత సులభం కాకపోవచ్చు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించడం, ఆటగాళ్లను సమన్వయపర్చడం, యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడం అతని ముందున్న సవాళ్లు. అయితే, ఆటగాడిగా సుదీర్ఘ కెరీర్, ఐపీఎల్‌లో మెంటార్‌గా అనుభవం గంభీర్‌కు కలిసిరానుంది.

భారత క్రికెట్‌లో గంభీర్‌కు ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉంది. 13 ఏళ్లపాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10, 324 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్‌గా అతనికి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. కోల్‌కతా జట్టును రెండుసార్లు(2012, 2014) విజేతగా నిలబెట్టాడు. మెంటార్‌గా కూడా ఐపీఎల్‌లో తన ముద్ర వేశాడు. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌ను ప్లే ఆఫ్స్ చేర్చాడు. అలాగే, ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

వచ్చే ఏడాది కీలకం

భారత ప్రధాన కోచ్‌గా గంభీర్ 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెలలో శ్రీలంక పర్యటనతో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే ఏడాది అతనికి చాలా కీలకం కానుంది. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ విజయంతో భారత్ మరోసారి వరల్డ్ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. కాబట్టి, ఈ రెండు టోర్నీలు గెలవడం భారత్‌కు ప్రతిష్టాత్మకం కానున్నాయి. 2013లో భారత్ చివరిసారిగా చాంపియన్ ట్రోఫీ నెగ్గింది. డబ్ల్యూటీసీ గత రెండు ఎడిషన్లలో భారత్ ఫైనల్‌లో బోల్తా పడింది. గంభీర్ ఈ సారి కూడా జట్టును ఫైనల్‌కు చేర్చడంతోపాటు టైటిల్ సాధించేలా జట్టును సిద్ధం చేయాల్సి ఉంది.

Next Story

Most Viewed