కేన్ మామ.. మజాకా! సచిన్, సెహ్వాగ్ రికార్డులు సమం

by Disha Web |
కేన్ మామ.. మజాకా! సచిన్, సెహ్వాగ్ రికార్డులు సమం
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. గత నెలలో ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో సెంచరీ చేసిన కేన్ విలియమ్సన్ లంకతో సిరీస్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అతడు తాజాగా వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.

దీంతో అతను క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను కూడా సమం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో విలియమ్సన్ 296 బంతులాడి 23 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 215 రన్స్ చేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 17 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.

లెజెండ్స్ సరసన కేన్..

రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేయడం ద్వారా కేన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది ఆరో డబుల్ సెంచరీ. దీంతో పలు రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. టెస్టుల్లో సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్ ల ఆరు డబుల్ సెంచరీల రికార్డును సమం చేశాడు.

ఇదే సమయంలో ఐదు ద్విశతకాలు చేసిన జోరూట్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐదు డబుల్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. అత్యధికంగా ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ తన కెరీర్ లో 52 టెస్టులు మాత్రమే ఆడి 12 ద్విశతకాలు సాధించడం గమనార్హం.Next Story