ఈ ఓటమి నన్ను బాధించింది: ప్యాట్ కమిన్స్

by Disha Web Desk 1 |
ఈ ఓటమి నన్ను బాధించింది: ప్యాట్ కమిన్స్
X

దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌ను తమ చేజేతులా చేజార్చుకున్నామని ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేసిన తమ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైందన్నాడు. ముఖ్యంగా షాట్ సెలెక్షన్ తమ పతనాన్ని శాసించిందన్నాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. ఈ ఓటమి తనను ఎంతగానో బాధించిందని వెల్లిబుచ్చాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో తాము చేసిన 260 పరుగులు మంచి స్కోర్, అని తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకొని చాలా చక్కగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కానీ, భారత్ ఇంకా అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు. కేవలం ఒకటి, రెండు భాగస్వామ్యాలతో సులువుగా 260 పరుగుల మార్క్‌ను సలువుగానే అందుకుందని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌ను కూడా తాము అద్భుతంగానే ప్రారంభించామని, కానీ, బ్రేక్ తరువాత మా బ్యాటింగ్ మరింత గాడి తప్పిందని తెలిపాడు. చెత్త షాట్లకు ప్రయత్నించి పేలవ బ్యాటింగ్‌తో చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ చేజారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఆటతీరుపై సమీక్ష చేయాల్సి ఉందన్నారు.

తమ బ్యాటర్లు స్వీప్ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకోవడంపై స్పందిస్తూ.. 'ప్రతీ ఒక్కరు వారికి స్టైల్‌కు తగ్గట్లు ఆడుతారు. కొన్ని బంతులకు ఎంత బాగా ఆడినా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే మా షాట్ సెలెక్షన్‌పై కూడా మేం సమీక్ష జరపాల్సి ఉంది. మేం చేసేది సరైందేనా? కాదా? అనేది తెలుసుకోవాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడటం నిరాశగా ఉంది. ముఖ్యంగా ఈ ఓటమి మరింత బాధ పెడుతుంది. ఎందుకంటే ఇది మేం గెలవాల్సిన మ్యాచ్. భారత్ కంటే మెరుగైన స్థితిలో మేం నిలబడ్డాం. భారత్‌లో ఎప్పుడూ జరగని విధంగా పై చేయి సాధించాం. కానీ విజయ లాంఛనాన్ని పూర్తి చేయలేకపోయాం.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

115 పరుగులతో లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవరల్లో 4 వికెట్లకు 118 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), చతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ రెండు వికెట్లు తీయగా.. టాడ్ ముర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. లేని పరుగుకు ప్రయత్నించి రోహిత్ శర్మ రనౌటయ్యాడు. అంతకుముందు 61/1 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ తొలి సెషన్‌లోనే ముగిసింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Next Story