పారిస్ ఒలింపిక్స్‌కు సుమిత్ క్వాలిఫై?

by Harish |
పారిస్ ఒలింపిక్స్‌కు సుమిత్ క్వాలిఫై?
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఏటీపీ రిలీజ్ చేసిన వరల్డ్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ 77వ స్థానానికి చేరుకున్నాడు. ఆదివారం సుమిత్ హెయిల్‌బ్రోన్ నెకర్‌కప్ టైటిల్ గెలుచుకున్నాడు. దీంతో ఏకంగా 18 స్థానాలు ఎగబాకిన అతను కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. టాప్-56 మంది ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే, ఒక దేశం నుంచి గరిష్టంగా నాలుగురు మాత్రమే పాల్గొనడానికి వీలు ఉంది. ఒలింపిక్స్ క్వాలిఫై ర్యాంకింగ్స్‌లో సుమిత్ వెనుకబడినప్పటికీ ఈ నిబంధన అతనికి కలిసిరానుంది.

ఒలింపిక్స్‌‌కు జూన్ ర్యాంకింగ్స్‌నే పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ నెల 12 నాటికి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ క్వాలిఫై అథ్లెట్లను జాబితాను జాతీయ సమాఖ్యలకు తెలియజేయనుంది. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు జెన్నిక్ సిన్నర్ వరల్డ్ నం.1గా అవతరించాడు. దీంతో అగ్రస్థానం సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు ముందు గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న జకోవిచ్ అగ్రస్థానాన్ని కోల్పోయి 3వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అల్కరాజ్ వ ర్యాంక్‌కు ఎగబాకాడు. పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న 4వ స్థానంలో ఉన్నాడు. యుకీ బాంబ్రీ 54వ, శ్రీరామ్ బాలాజీ 67వ ర్యాంక్‌ల్లో నిలిచారు.



Next Story

Most Viewed