ధావన్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా సిరీస్.. సీనియర్లకు విశ్రాంతి..!

by Disha Web |
ధావన్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా సిరీస్.. సీనియర్లకు విశ్రాంతి..!
X

న్యూఢిల్లీ : ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్‌తో బిజీకానుంది. లీగ్ అనంతరం భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటన చేయనుంది. అయితే, సౌతాఫ్రికా సిరీస్‌కు భారత జట్టులో సెలక్టర్లు కీలక మార్పులు చేయనున్నట్టు తెలుస్తున్నది. అన్ని ఫార్మాట్లలో భాగమయ్యే ఆటగాళ్లతో పాటు సీనియర్లను పక్కనబెట్టనున్నారని సమాచారం. ఈ సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ ఏడాదిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు సెలక్షన్ కమిటీ, బీసీసీఐ భారత జట్టును అన్ని విధాలా పరీక్షించాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. మరో వైపు, సౌతాఫ్రికా సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నది. మరోవైపు, భవిష్యత్తు కెప్టెన్సీ రేసులో ఉన్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లను సైతం ఈ సిరీస్‌కు దూరం పెట్టనున్నారు. అలాగే, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీలకు సైతం రెస్ట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న శిఖర్ ధావన్‌ను ఈ సిరీస్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నది.

రేసులో హార్దిక్ పాండ్యా..

సీనియర్లు దూరం కావడంతో సౌతాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్సీ రేసులో ధావన్‌కు, హార్దిక్ పాండ్యా గట్టిపోటీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్‌ను పాండ్యా అద్భుతంగా నడిపిస్తున్నాడు. అలాగే, తిరిగి ఫామ్‌లోకి రావడంతోపాటు జట్టు విజయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దాంతో పాండ్యా తిరిగి జట్టులోకి రావడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా సిరీస్‌కు పాండ్యానే నాయకత్వం వహిస్తాడని కొందరి వాదన. మరోవైపు, శ్రీలంక సిరీస్‌కు సారథ్యం వహించిన ధావన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని మెజార్టీ అభిప్రాయం. సెలక్షన్ కమిటీ సైతం ధావన్‌కవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇంకోవైపు, ఐర్లాండ్ సిరీస్‌కు పాండ్యాను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌతాఫ్రికా సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చిన సీనియర్లను ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్‌ సిరీస్‌కు నేరుగా ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.



Next Story