నిరాశ మిగిల్చిన టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్

by Dishanational4 |
నిరాశ మిగిల్చిన టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్
X

సిన్సినాటి: తనకు ఇంకా ప్రాక్టీస్ అవసరమని ప్రముఖ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ అన్నాడు. పొత్తి కడుపులో నొప్పి కారణంగా గురువారం సిన్సినాటిలో జరిగిన ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నమెంట్‌లో రఫెల్ ఓడిపోయాడు. రెండో రౌండ్‌లో ప్రత్యర్థి బోర్నా కోరిక్ చేతిలో 6-7, 6-4, 3-6 తేడాతో రఫెల్ ఓటమి పాలయ్యాడు. అయితే జులై ప్రారంభంలో పొత్తి కడుపు గాయం కారణంగా వింబుల్డన్ సెమీ ఫైనల్ నుంచి నాదల్ తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాదల్ ఎలాంటి పోటీ మ్యాచుల్లో పాల్గొనలేదు. చాలా రోజుల విరామం తర్వాత సిన్సినాటిలో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్న రఫెల్‌కు నిరాశే మిగిలింది. పొత్తి కడుపులో నొప్పి, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మ్యాచ్‌లో ఓడిపోయినట్లు రఫెల్ ఒప్పుకున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ మ్యాచ్‌కు నేను సిద్ధంగా ఉన్నట్లు అనిపించలేదు. అందుకే మ్యాచ్‌లో మంచి ప్రదర్శనను కనబర్చలేకపోయాను. పొత్తి కడుపు నొప్పి వల్ల ప్రాక్టీస్‌కు దూరమయ్యాను. ఇకపై ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. మెరుగైన ఫలితాలు సాధించాలంటే నాకు ఇంకా కొద్ది రోజులపాటు సమయం కావాలి. మళ్లీ ఫామ్‌లోని రావడానికి కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది.' అని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 29న ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్‌లో పాల్గొననున్నారు.


Next Story