మూడో టీ20 ఎవరిదో?.. నేడు భారత్, జింబాబ్వే మధ్య మూడో టీ20

by Harish |
మూడో టీ20 ఎవరిదో?.. నేడు భారత్, జింబాబ్వే మధ్య మూడో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే పర్యటనలో తొలి టీ20 ఓడిన యువ భారత్ తిరిగి పుంజుకుంది. రెండో టీ20లో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నేడు హరారే వేదికగానే మూడో టీ20 జరగనుంది. గత మ్యాచ్‌లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గిల్ సేన అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జైశ్వాల్, శాంసన్, దూబె రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలపడింది. రెండో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారీ విజయం సాధించినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని తొలి టీ20లోనే అర్థమైంది. కాబట్టి, ఆల్‌రౌండ్ ప్రదర్శననే భారత జట్టు నమ్ముకుంది. మరోవైపు, మూడో టీ20లో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జింబాబ్వే ఆశిస్తున్నది.

ఆ ముగ్గురు వచ్చారు.. జట్టులో మార్పులు ఉంటాయా?

టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు తిరిగి జట్టులో చేరారు. వీరి రాకతో మూడో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, ఆ ముగ్గురికి చోటు కల్పించడం కెప్టెన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. అయితే, జైశ్వాల్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఓపెనర్‌గా అతన్ని తీసుకోవాలంటే అభిషేక్ శర్మను తప్పించాలి. రెండో టీ20లో అభిషేక్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కాబట్టి, అతన్ని తప్పించడం డౌటే. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ స్థానాన్ని శాంసన్ భర్తీ చేయనున్నాడు. ఇక, సాయి సుదర్శన్ జట్టు నుంచి రిలీజ్ అవడంతో దూబె కూడా చోటు ఖాయంగా కనిపిస్తోంది. శాంసన్, దూబె రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలంగా మారింది. బౌలింగ్ పరంగా ముకేశ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ టచ్‌లో ఉన్నారు.

ప్రత్యర్థితో జాగ్రత్త

జింబాబ్వేను సులభంగా తీసుకోవద్దని భారత్‌కు తొలి టీ20లోనే అర్థమైంది. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. మాధవెరే, బెన్నెట్, రజా, డియోన్ మైయర్స్, క్లైవ్ మాదండే భారత బౌలర్లను ఇబ్బందిపెట్టేవారే. బౌలింగ్ దళంలో ముజారబానీ ఫామ్‌లో ఉన్నాడు. అతనితోపాటు చటార, రజాలతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

తుది జట్లు(అంచనా)

భారత్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.

జింబాబ్వే : మాధవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, కాంప్‌బెల్, క్లైవ్ మాదండే, వెల్లింగ్టన్ మసకడ్జా, ల్యూక్ జాంగ్వే, ముజారబానీ, చటార.

Advertisement

Next Story

Most Viewed