ఆసిస్ విజయానికి 7 వికెట్లు.. పోరాడుతున్న కివీస్

by Harish |
ఆసిస్ విజయానికి 7 వికెట్లు.. పోరాడుతున్న కివీస్
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు శనివారం ఆసక్తికరంగా మారింది. ఆసిస్ విజయానికి 7 వికెట్లు అవసరమవ్వగా.. కివీస్ గెలుపొందాంటే ఇంకా 258 పరుగులు చేయాల్సిన పరిస్థితితో మూడో రోజు ముగిసింది. ముందుగా ఓవర్‌ నైట్ స్కోరు 13/2తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్(5/45) ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతనికి తోడు మ్యాట్ హెన్రీ(3/36), సౌథీ(2/46) రాణించడంతో ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. ఆసిస్ బ్యాటింగ్ లైనప్‌లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. నాథన్ లైయన్(41) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 204 పరుగులు కలుపుకుని ఆసిస్.. న్యూజిలాండ్ ముందు 369 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఛేదనలో కివీస్ పోరాడుతున్నది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(56 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. అతనితోపాటు డారిల్ మిచెల్(12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కివీస్ ఇంకా 258 పరుగులు చేస్తే గెలుపు తీరాలకు చేరుతుంది. అయితే, టామ్ లాథమ్(8), విల్ యంగ్(15), కేన్ విలియమ్స్(9) వంటి కీలక ప్లేయర్లను కోల్పోయిన కివీస్ కష్టాల్లో పడింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా ఆదివారం ఫలితం తేలే చాన్స్ ఉంది. పిచ్ స్వభావాన్ని చూస్తే ఆసిస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా్యి.



Next Story

Most Viewed