భారత యువ షట్లర్ సంచలనం.. ఓర్లీన్స్ మాస్టర్స్‌ టోర్నీలో క్వార్టర్స్‌కు క్వాలిఫై

by Disha Web Desk 13 |
భారత యువ షట్లర్ సంచలనం.. ఓర్లీన్స్ మాస్టర్స్‌ టోర్నీలో క్వార్టర్స్‌కు క్వాలిఫై
X

పారిస్: ఓర్లీన్స్ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ఏకంగా టాప్ సీడ్‌‌కే షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో రజావత్ 21-8, 21-16 తేడాతో టాప్ సీడ్, జపాన్ స్టార్ ప్లేయర్ కెంటో నిషిమోటోను చిత్తు చేశాడు. 42 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో రజావత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత షట్లర్ వరుసగా 10 పాయింట్లను గెలుచుకుని తొలి గేమ్‌ను ఏకపక్షం చేశాడు.

తొలి గేమ్‌లో ప్రత్యర్థి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. రెండో గేమ్‌లో జపాన్ స్టార్ పుంజుకోవడంతో కాస్త వెనుకబడిన రజావత్.. 7-7తో స్కోరు సమం చేసి జోరు కొనసాగించాడు. స్కోరు 11-11తో సమమైన తర్వాత లీడ్‌లోకి దూసుకెళ్లిన రజావత్.. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 58 ర్యాంక్ కలిగిన రజావత్.. వరల్డ్ నం.12 ర్యాంకర్ నిషిమోటోను ఓడించడం విశేషం.

మరో భారత ఆటగాడు మిథున్ మంజునాథ్ 15-21, 19-21 తేడాతో తైవాన్ ప్లేయర్ చి యు-జెన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో తన్య హేమంత్ సైతం ఇంటిదారి పట్టింది. జపాన్ క్రీడాకారిణి నట్సుకి నిడైరా చేతిలో 21-8, 21-17 తేడాతో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాయి ప్రతీక్-తనీషా 23-21, 17-21, 21-23 తేడాతో 7వ సీడ్, మలేషియా ద్వయం చెన్ టాంగ్ జీ-తోహ్ ఈ వీ చేతిలో పోరాడి ఓడింది.

Next Story

Most Viewed