టీ20 సిరీస్‌పై భారత్ గురి.. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20

by Dishanational3 |
టీ20 సిరీస్‌పై భారత్ గురి.. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే. తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టీ20 గెలుపుతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా సిరీస్ విజయంపై కన్నేసింది. నేడు ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది. తొలి టీ20 జోరునే రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తున్నది. అఫ్గాన్‌తో జరుగుతున్న తొలి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఇదే. తొలి మ్యాచ్‌లో కనబర్చిన ఆల్‌రౌండ్ ప్రదర్శననే కొనసాగిస్తే విజయం భారత్‌కు నల్లేరు మీద నడకే. అయితే, అఫ్గాన్‌ను ఏమాత్రం ఈజీగా తీసుకోవడానికి లేదు. సిరీస్ సమం కోసం ఆ జట్టు గట్టిగా పోరాడే అవకాశం ఉంది. మరి, టీమ్ ఇండియా రెండో టీ20లోనే సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకుంటుందా? అనేది చూడాలి.

టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉన్నది. తొలి మ్యాచ్‌లో విజయం భారత ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనా నేపథ్యంలో భారత్ బ్యాటింగ్ సామర్థ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ జట్టుతో చేరడం జట్టు బలాన్ని మరింత పెంచేదే. గాయం కారణంగా తొలి టీ20కి దూరమైన యశస్వి జైశ్వాల్ కోహ్లీ రాకతో రెండో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రీఎంట్రీ మ్యాచ్‌లో రోహిత్ అనూహ్యంగా రనౌట్‌గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. ఇండోర్ పిచ్‌పై పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో రోహిత్‌కు మంచి రికార్డే ఉన్నది. 2017లో శ్రీలంకపై సెంచరీ బాదిన హిట్‌మ్యాన్.. గతేడాది న్యూజిలాండ్‌పై వన్డేలో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో రెండో టీ20లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ పిచ్‌పై గతేడాది గిల్‌ రెండు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గిల్ జోడీపై భారీ అంచనాలు నెలకొనగా..నేటి మ్యాచ్‌లో ఈ జోడీ శుభారంభం అందించాల్సి ఉంది. ఇక, దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడబోతున్న కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబె అదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అలాగే, తిలక్ వర్మ, జితేశ్ వర్మ, రింకు సింగ్‌ల నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. రెండో టీ20లోనూ సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ బెర్త్‌లు ఖాయం. గత మ్యాచ్‌లో ఆడిన రవి బిష్ణోయ్‌ను తప్పించి సీనియర్ కుల్దీప్ యాదవ్‌ను మెయిన్ స్పిన్నర్‌గా తీసుకునే చాన్స్ ఉంది. అతనితోపాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నాడు.

కోహ్లీపై అందరి దృష్టి

రెండో టీ20లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. టీ20ల్లోకి పునరాగమనం చేసిన అతను దాదాపు 14 నెలల తర్వాత పొట్టి మ్యాచ్ ఆడబోతున్నాడు. వాస్తవానికి అతను తొలి టీ20లోనే ఆడాల్సి ఉండగా.. వ్యక్తిగత కారణాలతో ఆ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. టీ20 వరల్డ్ క-2022లో ఇంగ్లాండ్‌తో కోహ్లీ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ ఏడాది మొత్తం విరాట్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఓ సెంచరీతోపాటు 8 హాఫ్ సెంచరీలు బాదాడు. ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే సెంచరీ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లోకి రీఎంట్రీ ఇస్తున్న కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అతనిపై భారీ అంచనాలు ఉండగా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

బ్యాటర్లదే హవా

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 209గా ఉన్నందంటే.. బ్యాటర్లు ఏ మేరకు సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పిచ్‌పై పేసర్లు, స్పిన్నర్లు సమానంగా ప్రభావం చూపొచ్చు. ఇక్కడ గతంలో మూడు టీ20 మ్యాచ్‌లు జరగగా రెండింట చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ స్టేడియంలో భారత్ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడగా.. రెండింట గెలిచింది. చివరిసారిగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడింది.

ఎక్కడ చూడొచ్చంటే?

భారత్, అఫ్గాన్ రెండో టీ20 నేడు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వెర్క్ చానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే, డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ/సంజూ శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ : గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీమ్ జనత్, ఫజాల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.

Next Story

Most Viewed