సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రీకాంత్ శుభారంభం..

by Disha Web Desk 13 |
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రీకాంత్ శుభారంభం..
X

సింగపూర్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-15, 21-19 తేడాతో కాంటాఫోన్ వాంగ్‌చారోన్‌(థాయిలాండ్)ను మట్టికరిపించాడు. తొలి గేమ్‌లో మొదటి ప్రత్యర్థి ఆధిపత్యమే కొనసాగగా.. శ్రీకాంత్ 0-5తో వెనుబడ్డాడు. అనంతరం పుంజుకున్న అతను 10-10తో స్కోరును సమం చేయడంతోపాటు థాయిలాండ్ ఆటగాడిని నిలువరించి తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక, రెండో గేమ్‌లో ఇరువురు నువ్వానేనా అన్నట్టు పోటీపడినప్పటికీ శ్రీకాంతే పైచేయి సాధించాడు. మరో మ్యాచ్‌లో ప్రియాన్ష్ రజావత్ 21-12, 21-15 తేడాతో జపాన్ క్రీడాకారుడు కాంట సునెయమను ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. అలాగే, పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీ రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో భారత ద్వయం 21-16, 21-15 తేడాతో లూకాస్ కోర్వీ-రొనాన్ లాబర్(ఫ్రాన్స్) జోడీని ఓడించింది.

స్టార్లు విఫలం..

భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్లు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. థాయిలాండ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మరోసారి నిరాశపర్చింది తొలి రౌండ్‌లో టాప్ సీడ్, ఆక్నే యమగూచి(జపాన్)తో తలపడిన ఆమె 21-18, 19-21, 17-21 తేడాతో పోరాడి ఓడిపోయింది. అలాగే, మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం విఫలమైంది.

7వ సీడ్, థాయిలాండ్ క్రీడాకారిణి రట్చనోక్ ఇంటనోన్ చేతిలో 21-19, 21-15 తేడాతో పరాజయం పాలైంది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ సైతం తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు. గత నెలలో మలేషియా మాస్టర్స్ నెగ్గిన ప్రణయ్ ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం. ప్రణయ్‌పై 21-15, 21-19 తేడాతో జపాన్ ఆటగాడు, 3వ సీడ్ కోడై నరౌకా గెలుపొందాడు. అలాగే, 5వ సీడ్ చౌ టియెన్ చెన్(చైనీస్ తైపీ) చేతిలో 18-21, 21-17, 21-13 తేడాతో లక్ష్యసేన్ ఓడిపోయాడు.


Next Story