రోహిత్ వారసుడిగా పాండ్యా?

by Disha Web Desk 16 |
రోహిత్ వారసుడిగా పాండ్యా?
X

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. అందుకు కారణం ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు రోహిత్ శర్మ. అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. అయితే, 36 ఏళ్ల హిట్‌మ్యాన్ మరిన్ని సీజన్లు ముంబైని నడిపించలేడని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ముంబై ఫ్రాంచైజీ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోవడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చింది. గుజరాత్ టైటాన్స్‌‌కు భారీ మొత్తం చెల్లించి అతన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిద్వారా పాండ్యానే ఫ్యూచర్ కెప్టెన్ అనే సంకేతాలు అభిమానులకు ఇచ్చినట్టైంది. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, అది వచ్చే సీజనా? ఆ తర్వాతి సీజనా? అనేది కచ్చితంగా చెప్పలేం. మరి, ఈ వార్తలు ఎంత వరకు నిజమో ముంబై ఇండియన్స్ స్పష్టతనివ్వాల్సి ఉంది.

ప్రచారమే నిజమైంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సొంతగూటికి చేరాడు. ట్రేడ్ విండోలో భాగంగా అతన్ని ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ముంబై ఇండియన్స్‌తోపాటు గుజరాత్ టైటాన్స్‌ కూడా సోషల్ మీడియాలో వేదికగా ధ్రువీకరించాయి. ఆదివారం అర్ధరాత్రి పాండ్యా ఫ్రాంచైజీ మార్పుపై డ్రామా కొనసాగింది. మొదట గుజరాత్ టైటాన్స్ పాండ్యాను పేరును రిటైన్ ప్లేయర్ల జాబితాలో చేర్చడంతో అతని ఫ్రాంచైజీ మారడం లేదని అందరూ భావించగా.. కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం కుదిరింది. పాండ్యాను కొనుగోలు చేసేందుకు ముంబై.. గుజరాత్‌కు భారీ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. వార్షిక వేతనం రూ. 15 కోట్లతోపాటు పెద్ద మొత్తంలో బదిలి రుసుము కూడా చెల్లించేందుకు ముంబై ముందుకు రావడంతో గుజరాత్ ఒప్పందానికి అంగీకరించిందని తెలుస్తోంది. దాంతో రెండేళ్ల తర్వాత హార్దిక్ తన సొంత గూటికి చేరుకున్నాడు. వచ్చే సీజన్‌లో ముంబై తరఫున ఆడనున్నాడు. 2015లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన అతను ఏడేళ్లపాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ముంబై జట్టు అతన్ని రిలీజ్ చేయగా.. గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ అప్పగించింది. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌కు పాండ్యా టైటిల్ అందించగా.. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు. అయితే, వరుసగా జట్టును రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌ను గుజరాత్ వదలుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. గుజరాత్ మేనేజ్‌మెంట్, హార్దిక్ పాండ్యాల మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాండ్యా జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పాండ్యా ముంబైలోకి వెళ్లాడని నిర్ణయం తీసుకున్నాడని, అతని నిర్ణయాన్ని తాము గౌరవించామని గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి తెలిపాడు. మరోవైపు, ముంబై జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉందంటూ పాండ్యా ఓ వీడియోను పోస్టు చేశాడు.

రోహిత్ తప్పుకుంటున్నాడా?

ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోవడంతో అభిమానుల్లో పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మనే జట్టును నడిపిస్తాడా? లేదా పాండ్యా కెప్టెన్‌ అవుతుడా? అన్నది ప్రధాన సందేహం. అలాగే, రోహిత్ ముంబై కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే, వచ్చే సీజన్‌లో రోహితే జట్టును నడిపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ, అతను మరికొన్ని సీజన్లు సారథిగా ఉంటాడని కచ్చితంగా చెప్పలేం. ముంబై ఇండియన్స్‌కే కాకుండా రోహిత్ జాతీయ జట్టుకు కూడా కెప్టెన్. ఒకే సమయంలో ఈ బాధ్యతలు మోయడం రోహిత్ శర్మపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుతోపాటు ముంబైకి కెప్టెన్‌గా ఉండటం ఒత్తిడితో కూడుకున్నది తెలిపాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 36 ఏళ్లు. వయసు దృష్ట్యా కూడా అతను ముంబైని మరిన్ని సీజన్లలో నడిపించలేడని క్రీడా విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

ఫ్యూచర్ కెప్టెన్ పాండ్యా

ఇక, రోహిత్ శర్మ వారసుడిగా ముంబై పగ్గాలను పాండ్యా చేపడతాడనే వార్తలను కొట్టిపారేయలేం. ఎందుకంటే.. గుజరాత్‌ను రెండు సార్లు ఫైనల్‌కు చేర్చాడు. అందులో మొదటి సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించి సారథిగా సత్తాచాటాడు. అంతేకాకుండా, కొంతకాలంగా రోహిత్ శర్మ టీ20లు ఆడటం లేదు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో జాతీయ జట్టును పాండ్యానే నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో 16 మ్యాచ్‌ల్లో భారత్ 10 విజయాలు సాధించింది. గుజరాత్ 33 మ్యాచ్‌ల్లో 23 మ్యాచ్‌ల్లో నెగ్గింది. రోహిత్ తర్వాత జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనే చేపడతాడనే వాదన కూడా ఉన్నది. అలాగే, ప్రస్తుతం పాండ్యా ఆటగాడిగానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను బెస్ట్ ఆల్‌రౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న ముంబై జట్టు పాండ్యాను తమ ఫ్యూచర్ కెప్టెన్‌గా భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాండ్యా వయసు 30 ఏళ్లు. రోహిత్ తర్వాత సుదీర్ఘంగా జట్టును నడిపించేందుకు హార్దిక్ సరైన వ్యక్తిని ముంబై భావించి ఉండొచ్చు. అందుకే, భారీ వార్షిక వేతనమే కాకుండా పెద్ద మొత్తంలో బదిలీ రుసుంను కూడా చెల్లించేందుకు ముందుకొచ్చిందని తెలుస్తోంది. అతన్ని తీసుకునేందుకు గత వేలంలో భారీ ధర రూ. 17.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను కూడా వదులుకునేందుకు ముంబై సిద్ధపడిందంటే.. పాండ్యా అవసరం ఆ జట్టుకు ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.



Next Story

Most Viewed