ఫుట్‌బాల్‌కు పవర్ హౌస్‌లాంటి రాష్ట్రంలో.. తొలిసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ

by Disha Web Desk 13 |
ఫుట్‌బాల్‌కు పవర్ హౌస్‌లాంటి రాష్ట్రంలో.. తొలిసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ
X

ఇంపాల్: అది చిన్నదే.. కానీ ఫుట్‌బాల్‌కు పవర్ హౌస్ లాంటి రాష్ట్రం మణిపూర్. తొలిసారి మణిపూర్ రాష్ట్రం అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెలలో స్నేహపూర్వకంగా జరగనున్న ఈ ముక్కోణపు అధికారిక టోర్నీలో భారత జట్టుతో పాటు మయన్మార్, కిర్గిస్థాన్ జట్లు తలపడతాయి. ఖుమన్ లాంపాక్ స్టేడియం ఈ టోర్నీకి వేదిక కానుంది. ఫిఫా అధికారం కింద మార్చి 22, 24, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబె, ప్రధాన కార్యదర్శి షాజి ప్రభాకరన్ సమక్షంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీని ప్రకటించారు. 'మణిపూర్ చరిత్రలో తొలిసారి అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహిస్తున్నాం.

ఏఐఎఫ్ఎఫ్ గొప్ప మనసుతో మాకీ అవకాశాన్ని ఇచ్చింది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.. అన్ని సదుపాయాలు కల్పిస్తామని మా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు అనేక మంది అంతర్జాతీయ ఆటగాళ్లను మణిపూర్ అందించింది. ఈ టోర్నీని నిర్వహించడం మాకు దక్కిన గౌరవం మాత్రమే కాకుండా క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి, మా ప్లేయర్స్‌కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది' అని ముఖ్యమంత్రి బిరేన్ అన్నారు. ఈ సందర్భంగా రెనెడి సింగ్, గౌరమంగి సింగ్, ఉదంత సింగ్, అమర్‌జిత్ కియమ్, సురేష్ వంగ్జమ్, జీక్సన్ సింగ్ వంటి మణిపూర్ ఆటగాళ్లను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వీరంతా భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.


Next Story

Most Viewed